ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
20న రాష్ట్ర బడ్జెట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు రోజులపాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. 20న డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు.
నిర్వహణ, వసతులు. భద్రతా ఏర్పాట్లు పూర్తి
అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసెంబ్లీ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమయ్యారు. మండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాష్ ముదిరాజ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి కార్యదర్శి వి.నరసింహా చార్యులు, శాసనసభా కార్యదర్శి రేండ్ల తిరుపతి, సీఎస్ రామకృష్ణారావు తోపాటు పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ, సహకారాన్ని అందిస్తామన్నారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు.



