నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో మారో మైనర్ బాలికపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో చోటు చేసుకొగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4వ తేదీన అదృశ్యమైన 13 ఏళ్ల మైనర్ బాలికపై సికింద్రాబాద్‌లో నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ బస్టాండ్ ప్రాంతంలో సంచరిస్తున్న బాలికను మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లిన నలుగురు యువకులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు తేలింది.
ఈ దారుణం గురించి తెలియగానే పోలీసులు వెంటనే లాడ్జికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు ఉండగా, మరో ఇద్దరికి 17 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు మేజర్ నిందితులను రిమాండ్‌కు తరలించగా, మైనర్ నిందితులను జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



