నవతెలంగాణ – హైదరాబాద్: కాన్పూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మందుల ధర విషయంలో చెలరేగిన ఒక చిన్న వాగ్వాదం, 22 ఏళ్ల లా విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మెడికల్ షాపు నిర్వాహకుడు, అతని స్నేహితులు కలిసి విద్యార్థి కడుపును పదునైన ఆయుధంతో కోసి, చేతి వేళ్లను నరికేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాన్పూర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం లా చదువుతున్న అభిజీత్ సింగ్ చందేల్, ఒక మెడికల్ షాపులో మందుల ధర గురించి అక్కడి సిబ్బంది అమర్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ తీవ్రం కావడంతో అమర్ సింగ్‌కు మద్దతుగా అతని సోదరుడు విజయ్ సింగ్, స్నేహితులు ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖిల్ కూడా దాడిలో పాల్గొన్నారు.
నలుగురూ కలిసి అభిజీత్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మొదట తలపై బలంగా కొట్టడంతో అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో అతని కడుపుపై దాడి చేసి చీల్చారు. తీవ్ర గాయాలతో ప్రాణభయంతో అభిజీత్ తన ఇంటి వైపు పరిగెత్తే ప్రయత్నం చేయగా, దుండగులు అతడిని మళ్లీ పట్టుకుని ఒక చేతి రెండు వేళ్లను నరికేశారు. అభిజీత్ కేకలు విన్న స్థానికులు అతడిని కాపాడేందుకు పరుగెత్తుకు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అభిజీత్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని తలకు 14 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు ప్రారంభించారు.



