వనరుల దోపిడీకి ఎత్తుగడలు
ప్రమాదంలో లాటిన్ అమెరికా దేశాలు
నోరు మెదపని మోడీ సర్కార్
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం సైనిక దుస్సాహసంతో మొదలైంది. అది అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వెనిజులాలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేశారు. దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య నిద్రిస్తుండగా బలవంతంగా అపహరించి అమెరికాకు తరలించారు. ఆ దంపతులను న్యూయార్క్ జైలులో నిర్బంధించారు. ఇరాక్‌పై దాడి చేసిన తర్వాత అమెరికా ఇంత దూకుడుగా భౌగోళిక రాజకీయ చర్యకు పాల్పడడం ఇదే మొదటిసారి.
స్వాతిశయం-అహంకారం
వెనిజులాపై దాడి చేసేందుకు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి కారణమేదీ కన్పించలేదు. మదురోను కొకైన్ ముఠాకు అధిపతిగా చూపించి దాడి చేశారు. ప్రపంచంలో అతి పెద్ద చమురు నిల్వలు కలిగి ఉన్న, ఓ చిన్న లాటిన్ అమెరికా దేశంపై విజయం సాధించి ఆనందించారు. ట్రంప్ స్వాతిశయంతో, అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఇది ఇతరులను బాధపెట్టి ఆనందించే క్రూరమైన మనస్తత్వమని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ, ట్రంపును వెనుక నుంచి ఆడించే పెట్టుబడిదారీ శక్తులు అంతకంటే క్రూరమైనవని తెలుసుకోవాలి. అమెరికా పూర్వ అధ్యక్షులైన బైడెన్, క్లింటన్, ఒబామా, జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్ తనకు సాటిరారని ట్రంప్ భావిస్తారు. క్యాపిటలిస్టులకు కావాల్సింది కూడా ఇలాంటి వారే. అందుకే వారు ట్రంపును ఎంచుకున్నారు.
శాంతి మంత్రం నుంచి యుద్ధ తంత్రం వైపు…
వెనిజులాలో పరిస్థితి తాను అనుకున్న విధంగా కుదుటపడే వరకూ ఆ దేశం తన నియంత్రణలోనే ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు. రాబోయే కాలంలో ట్రంప్ వెనిజులాపై తన ఆధిపత్యాన్ని ఎలా చెలాయిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తాత్కాలిక అధ్యక్షురాలైన రోడ్రిగుయెజ్ తన మాట వినకపోతే మదురోకు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ఆమె తన స్వరాన్ని కొంత తగ్గించుకున్నారు. ట్రంప్ కోరికలు అపరిమితంగా కన్పిస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు కూడా ఆయన హెచ్చరికలు పంపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కొలంబియాను పరిపాలిస్తున్నాడంటూ హేళన చేశారు. ‘ఆపరేషన్ కొలంబియా’ చేపట్టడం మంచిదని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక గ్రీన్‌లాండ్‌పై కూడా ట్రంప్ కన్నేశారు. అది తమకు చాలా అవసరమని చెప్పారు. వెనిజులా చమురు లేని క్యూబా కూడా పతనానికి సిద్ధంగా ఉన్నదని శాపనార్థాలు పెట్టారు. గత సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం అలమటించిన ట్రంప్ ఈ ఏడాది యుద్ధోన్మాదిగా మారారు. వనరులను దోచుకోవడమే లక్ష్యంగా నయా వలసవాదం రూపుదిద్దుకుంటోంది. అది లాటిన్ అమెరికా దేశాలను ప్రమాదంలోకి నెడుతోంది.
లొంగుబాటు అవసరం లేదు
ప్రధాని నరేంద్ర మోడీ తన ”సన్నిహిత మిత్రుడు” అమెరికా అధ్యక్షుడని చెప్పుకుంటాడు. అయినప్పటికీ ట్రంప్ విధానం దోపిడీయే. అందులో తన, మన బేధం లేదు. వెనిజులా చమురు అయినా, భారత మార్కెట్ అయినా నియంత్రణే ఆయన అంతిమ లక్ష్యం. ఆయన మన దేశాన్ని అమెరికా వ్యవసాయోత్పత్తులకు డంపింగ్ కేంద్రంగానే చూస్తున్నారు. అమెరికా లేదా ఏ ఇతర దేశం నుంచైనా ఒత్తిడి ఎదురైతే దానికి లొంగిపోవాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఎందుకంటే వృద్ధి రేటు బాగానే ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. దేశీయ డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ సుంకాలు విధించినప్పటికీ ఎగుమతులు బాగానే జరుగుతున్నాయి. వెనిజులా పరిస్థితి మన చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయబోదు. ఎందుకంటే ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు ఇప్పటికే తగ్గిపోయాయి. ఇక రాజకీయంగా చూస్తే ప్రధాని బలమైన స్థితిలోనే ఉన్నారు. అలాంటప్పుడు అమెరికా ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏముంది?
సాధించిందేముంది?
నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ తనను తాను గొప్ప వ్యక్తిగా భావించుకున్నారు. భారత్-పాక్ ఘర్షణ సహా ఎనిమిది యుద్ధాలను ఆపించానని ప్రగల్భాలు పలికారు. తాను అధికారాన్ని చేపట్టిన రోజే ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని గొప్పలు పోయారు. అయితే వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉక్రెయిన్ ఇంధన గ్రిడ్‌పై రష్యా దాదాపు ప్రతి రోజూ క్షిపణి దాడులు చేస్తూనే ఉంది. ఫిబ్రవరి నాటికి ఉక్రెయిన్‌లోని కుప్‌యాన్స్క్ నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడంలోనూ, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా చేసి రష్యాను లొంగదీసుకోవడంలోనూ ట్రంప్ చాలా వరకూ విఫలమయ్యారు. దీంతో తన తదుపరి లక్ష్యంగా బలహీనంగా ఉన్న దేశాలను ఎంచుకొని వాటిపై సైనిక దాడులు జరిపేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
ఎందుకీ మెతక వైఖరి?
అమెరికా చర్యలను అనేక ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. వెనిజులాపై జరిగిన దురాక్రమణను చైనా, రష్యా నిరసించాయి కానీ జోక్యం చేసుకునే అవకాశాలు కన్పించడం లేదు. ఆర్థిక వృద్ధి, అవినీతి నిరోధక చర్యలపై చైనా దృష్టి సారిస్తుండగా ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు సమస్యగా ఉంది. అమెరికా ‘ఆమోదయోగ్యం కాని గీత’ దాటిందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా మండిపడ్డారు. స్పెయిన్, చిలీ, కొలంబియా, మెక్సికో, ఉరుగ్వే సహా అనేక దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. మరి భారతదేశం..? ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తుంటే మన దేశం స్పందన ఏమిటి? అమెరికాతో వ్యవహారమంటే భారత్ ఎప్పుడూ ఆచితూచి అడుగేస్తుంది. వివాదాల జోలికి పోదు. పొరుగు దేశాలపై మాత్రం ప్రతాపం చూపిస్తుంటుంది. అగ్రరాజ్యం దూకుడుగా, దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు, అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మౌనం వహిస్తోంది.



