రెండో వన్డేలో 2 వికెట్లతో గెలుపు
విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్
0-2తో చేజారిన వన్డే సిరీస్
భారత్ 264/9, ఆస్ట్రేలియా 265/8
భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు ఊహించని భంగపాటు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనాన్ని సిరీస్ విజయంతో సంబురం చేయాలని అభిమానులు ఎదురుచూడగా.. వరుస మ్యాచుల్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బ్యాటర్లు నిరాశపరిచిన వేళ తొలుత భారత్ 264/9 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలోనే ఛేదించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సిడ్నీలో శనివారం జరుగుతుంది.
నవతెలంగాణ-ఆడిలైడ్
ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా అలవోక విజయం సాధించింది. పరుగుల వేటలో బ్యాటర్లు, వికెట్ల వేటలో బౌలర్లు అంచనాలు అందుకోలేదు. గురువారం ఆడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాథ్యూ షార్ట్ (74, 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్ (61 నాటౌట్, 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో చెలరేగారు. ట్రావిశ్ హెడ్ (28, 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), మిచెల్ ఓవెన్ (36, 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/37), అర్ష్‌దీప్ సింగ్ (2/41), హర్షిత్ రానా (2/59) రెండేసి వికెట్లు పడగొట్టినా.. ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచటంలో విఫలం అయ్యారు. మరో 22 బంతులు ఉండగానే ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మూడు మ్యాచుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (73, 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61, 77 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. విరాట్ కోహ్లి (0) వన్డే కెరీర్‌లో తొలిసారి వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ కాగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9) తేలిపోయాడు. కెఎల్ రాహుల్ (11), వాషింగ్టన్ సుందర్ (12), నితీశ్ కుమార్ రెడ్డి (8) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా (4/60) నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (3/39) మూడు వికెట్లు తీశాడు. ఆడం జంపా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
రాణించిన రోహిత్, శ్రేయస్
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ (73) అర్థ సెంచరీతో మెరిసినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లి (0) నిరాశపరిచారు. ఆసీస్ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ ఓవర్ తొలి బంతికి గిల్‌ను అవుట్ చేసిన జేవియర్.. ఐదో బంతికి విరాట్ కోహ్లిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. జేవియర్ దెబ్బకు భారత్ 17/2తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ పవర్‌ప్లేలో దూకుడు చూపించలేదు. దీంతో తొలి పది ఓవర్లలో భారత్ 29 పరుగులే చేసింది.
ఆసీస్ పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో రోహిత్, శ్రేయస్ ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కు 136 బంతుల్లో 118 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. రోహిత్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. శ్రేయస్ అయ్యర్ ఐదు బౌండరీలతో 67 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేశాడు.
ఈ ఇద్దరు అర్థ సెంచరీలతో కుదురుకోవటంతో భారత్ మంచి స్కోరు సాధించేలా కనిపించింది. పవర్‌ప్లేలో జేవియర్ దెబ్బతీయగా.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ ఆడం జంపా మాయ చేశాడు. రోహిత్ శర్మను మిచెల్ స్టార్క్ సాగనంపగా.. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ (44), కెఎల్ రాహుల్ (11), నితీశ్ కుమార్ రెడ్డి (8)లను ఆడం జంపా వెనక్కి పంపించాడు. మిడిల్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ విలువైన ఇన్నింగ్స్ ఆడినా.. భాగస్వామ్యాలు నమోదు కాలేదు. ఆరో వికెట్‌కు అక్షర్, వాషింగ్టన్ 39 పరుగులు జోడించగా.. తొమ్మిదో వికెట్‌కు అర్ష్‌దీప్, రానాలు 37 పరుగులు జత చేశారు. టెయిలెండర్ల సహకారంతో భారత్ 264 పరుగులు చేసింది. హర్షిత్ రానా (24 నాటౌట్, 18 బంతుల్లో 3 ఫోర్లు), అర్ష్‌దీప్ సింగ్ (13, 14 బంతుల్లో 2 ఫోర్లు) విలువైన పరుగులు జోడించారు.
కూల్‌గా కొట్టారు!
265 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రావిశ్ హెడ్ (28) సహా అలెక్స్ కేరీ (9) త్వరగా నిష్క్రమించినా.. మాథ్యూ షార్ట్ (74), మాట్ రెన్షా (30), కూపర్ (61 నాటౌట్), మిచెల్ ఓవెన్ (36) మెరిశారు. మాథ్యూ షార్ట్ మూడు క్యాచులు వదిలేసిన భారత్.. భారీ మూల్యం చెల్లించింది. మిడిల్ ఆర్డర్‌లో షార్ట్, కూపర్‌లు 55 పరుగులు.. కూపర్, ఓవెన్ 59 పరుగులు జత చేయటంతో ఆసీస్ ఛేదన సులువైంది. టాప్ ఆర్డర్‌ను ఇరకాటంలో పడేసిన భారత బౌలర్లు.. లోయర్ మిడిల్ ఆర్డర్‌ను కట్టడి చేయటంలో తేలిపోయింది. ఫలితంగా వికెట్లు పడినా.. కంగారూ శిబిరంలో ఎటువంటి కంగారు కనిపించలేదు. హర్షిత్ రానా, నితీశ్ కుమార్ పరుగుల నియంత్రణ పాటించలేదు. ఓ ఎండ్ నుంచి ఒత్తిడి లేకపోవటం ఆసీస్ బ్యాటర్లకు కలిసొచ్చింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) హాజిల్‌వుడ్ (బి) స్టార్క్ 73, శుభ్‌మన్ గిల్ (సి) మార్ష్ (బి) జేవియర్ 9, విరాట్ కోహ్లి (ఎల్బీ) జేవియర్ 0, శ్రేయస్ అయ్యర్ (బి) జంపా 61, అక్షర్ పటేల్ (సి) స్టార్క్ (బి) జంపా 44, కెఎల్ రాహుల్ (బి) జంపా 11, వాషింగ్టన్ సుందర్ (సి) హాజిల్‌వుడ్ (బి) జేవియర్ 12, నితీశ్ కుమార్ (స్టంప్డ్) అలెక్స్ (బి) జంపా 8, హర్షిత్ రానా నాటౌట్ 24, అర్ష్‌దీప్ సింగ్ (బి) స్టార్క్ 13, మహ్మద్ సిరాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 9,
మొత్తం : (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264.
వికెట్ల పతనం : 1-17, 2-17, 3-135, 4-160, 5-174, 6-213, 7-223, 8-226, 9-263.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 10-0-62-2, జోశ్ హాజిల్‌వుడ్ 10-2-29-0, జేవియర్ బార్ట్‌లెట్ 10-1-39-3, మిచెల్ ఓవెన్ 2-0-20-0, ఆడం జంపా 10-0-60-4, కూపర్ 3-0-11-0, మాథ్యూ షార్ట్ 3-0-23-0, ట్రావిశ్ హెడ్ 2-0-16-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : మిచెల్ మార్ష్ (సి) రాహుల్ (బి) అర్ష్‌దీప్ 11, ట్రావిశ్ హెడ్ (సి) కోహ్లి (బి) రానా 28, మాథ్యూ షార్ట్ (సి) సిరాజ్ (బి) రానా 74, మాట్ రెన్షా (బి) అక్షర్ 30, అలెక్స్ కేరీ (బి) వాషింగ్టన్ 9, కూపర్ నాటౌట్ 61, మిచెల్ ఓవెన్ (సి) అర్ష్‌దీప్ (బి) వాషింగ్టన్ 36, జేవియర్ (సి) శుభ్‌మన్ (బి) అర్ష్‌దీప్ 3, మిచెల్ స్టార్క్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 4, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (46.2 ఓవర్లలో 8 వికెట్లకు) 265.
వికెట్ల పతనం : 1-30, 2-54, 3-109, 4-132, 5-187, 6-246, 7-255, 8-260.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 10-0-49-1, అర్ష్‌దీప్ సింగ్ 8.2-0-41-2, హర్షిత్ రానా 8-0-59-2, వాషింగ్టన్ సుందర్ 7-0-37-2, నితీశ్ కుమార్ రెడ్డి 3-0-24-0, అక్షర్ పటేల్ 10-0-52-1.