– వారిలో ఒకరి పరిస్థితి విషమం
– విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు
– పుస్తకాలు పంపిస్తుండగా ఘటన
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శివ, నాని, అశోక్, కార్తీక్, సాయి అనే విద్యార్థుల చేత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఆర్‌సీ భవనం నుంచి మంగళవారం పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను ఆటోలో ఎక్కించి పంపారు. మార్గమధ్యలో ట్రయల్ ఆటో టైరు పగిలి ఆటో బోల్తా పడింది. పాఠ్యపుస్తకాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో విద్యార్ధులను నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఒక విద్యార్థికి మాత్రం మామూలుగా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన విద్యార్థులు ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ప్రధానోపాధ్యాయులు.. ఎంఆర్‌సీ భవన్ నుంచి విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు తెప్పించారని, అప్పుడే తల్లిదండ్రులు రిపోర్టు చేసినా వారి తీరులో మార్పురాలేదని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులతో పనిచేయిస్తున్న ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆటో బోల్తా.. నలుగురు విద్యార్థులకు గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



