Sunday, July 13, 2025
E-PAPER
Homeసోపతిస్వయం ప్రతిరక్షకవ్యాధులు

స్వయం ప్రతిరక్షకవ్యాధులు

- Advertisement -

అవును, మీరు సరిగ్గానే చదివారు. శరీర రోగనిరోధక వ్యవస్థ, కొన్ని అనివార్య కారణాల వలన, శరీరం సాధారణ కణజాలాలపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు ఏర్పడే అసాధారణ, వ్యాధిగ్రస్త పరిస్థితులను, స్వయం ప్రతిరక్షక (ఆటోఇమ్యూన్‌) వ్యాధులు అని అంటారు. శరీర రక్షణ కవచమే శరీరాన్ని కొల్లగొట్టే ఆయుధమై పోతుందన్న మాట!
మనిషి దేహంలో జీర్ణ, శ్వాస, రక్త, మూత్ర, నరాల, తదితర వ్యవస్థలున్నట్లే రోగనిరోధక వ్యవస్థ ఒకటి ఉందని, ఆ యంత్రాంగం, ఒక్కొక్క హానిజనక క్రిమిని గుర్తించి, దాని సంహరణార్థం చేపట్టవలసిన వివిధ గతివిధులు, ‘పోలీస్‌ కణాల’ తయారీ, శిక్షణ, ఇత్యాది వాటిని అమలుపరచడంలో ప్రావీణ్యత కలిగి ఉంటుందని, అది ప్రేరేపితమైనప్పుడు, ఆ కణాలు, శరీరంలో ఎక్కడెక్కడి క్రిములుచేరి, అస్వస్థత కలిగిస్తున్నాయో, ఆయా చోట్లకు, రక్తం ద్వారా చేరవేయ బడతాయని గత వారం తెలుసుకున్నాం. పోలీస్‌ కణాలు మాములుగా సహజ స్వీయకణాల పైదాడి చేయవు.
స్వయం-ప్రతిరక్షణ అవసరం శరీరానికి ఎందుకు, ఎప్పుడు, ఎలా కలుగుతుంది?
సహజ లేదా స్వీయకణాలు, వాతావరణ కాలుష్యం, కిరణీకరణం (రేడియేషన్‌), కాంతిసంవేదిత స్థితి (ఫోటోసేన్సిటివిటి), సూర్యరశ్మి, వేడి లేదా శీతల ప్రతికూలత (కోల్డ్‌ఎలర్జీ), కొన్ని మందులు, మలేరియా, కొన్ని వైరల్‌ అంటువ్యాధుల వంటి భౌతిక, రసాయనిక లేదా జీవసంబంధ ప్రభావాల వలన మార్పు చెందడంతో, శరీరంలో నిరోగనిరోధక యంత్రాంగం, ఆ విధంగా ప్రభావితమైన కణాలను స్వయం కణాలుగా గుర్తించడంలో విఫలమవుతుంది.
వాటిని పొరపాటుగా నూతన లేదా శరీరేతర కణాలుగా భావించి, వాటిమీద దాడి చేస్తుంది. ఆ క్రమంలో, మార్పుకు గురైన కణాలు, ఆ కణాల సముదాయమైన అవయవాలు, రోగగ్రస్తమౌతాయి.
కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు జన్యుజనితం. జన్యుపరంగా ప్రేరేపించబడినప్పుడు, కొందరిలో వ్యక్తమవ్వవచ్చు.
సాధారణంగా, ఈ వ్యాధులు, హార్మోన్ల కారణంగా, పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా అభివద్ధి చెందుతాయి.
ముఖ్యంగా గర్భధారణ, ప్రసవ, రుతుక్రమ మార్పు దశ (పెరిమెనోపాసల్‌) లేదా విరతి (పోస్ట్మెనోపాసల్‌) తరుణంలో జరిగే ప్రధాన హార్మోన్ల స్థాయిల హెచ్చు తగ్గుల వలన స్వయం ప్రతిరక్షక వ్యాధులు వ్యక్తం కావచ్చు, లేదా ఉన్నవి ప్రభావితమూ అవవచ్చు.
స్వయం ప్రతిరక్షక వ్యాధి లక్షణాలు ఏమిటి?
కండరాల నొప్పి, కీళ్లనొప్పి లేదా బలహీనత, జ్వరం, నిద్రలేమి, బరువు తగ్గడం, వేడికి అసహనం లేదా వేగవంతమైన హదయ స్పందన, పునరావత దద్దుర్లు, సూర్యకాంతికి సున్నితత్వం; ముక్కు, బుగ్గలపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు, జుట్టు ఊడటం, చర్మంపై లేదా నోటిలోపల తెల్లటిమచ్చలు, తడారిన నోరు, కళ్ళు, చర్మం, పాదాలు, చేతుల్లో జలదరింపు, తిమ్మిరి, ఏకాగ్రతలో ఇబ్బంది, పొత్తి కడుపునొప్పి, మలంలో రక్తం లేదా శ్లేష్మం, లేదా అతిసారం, నోటిపూత, రక్తం గడ్డ కట్టడం, స్త్రీలలో బహుళ గర్భస్రావాలు… ఇత్యాది అతి సాధారణమైన, మామూలు రుగ్మతల్లో కలిగే శారీరక అసౌకర్య స్థితి నుండి తీవ్రస్థాయి లక్షణాలు, ఒకటి కంటే ఎక్కువ, తరచుగా ఈ వ్యాధులలో కలుగవచ్చు.
శరీరంలో ఏ అవయవమైనా ఈ జబ్బులకు గురై, మంద్రస్థాయి తీవ్రత నుండి హెచ్చు స్థాయి వరకు ఎన్నో రకాలుగా, ఎవరిలోనైనా, దాదాపు వంద రకాల స్వయం ప్రతి రక్షక వ్యాధులు ప్రకటిత మవ్వవచ్చు.
ఉదాహరణకు పేర్కొనడానికి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు: మధుమేహం, కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్తరైటిస్‌), బొల్లి (సోరియాసిస్‌), మల్టిపుల్‌ ల్స్క్లేరోసిస్‌, థైరాయిడ్‌కి సంబంధించిన హషిమోటోరోసిస్‌. గ్రేవ్స్డిసీస్‌, కండరాలకు సంబంధించిన మాయిస్తేనియగ్రేవీస్‌, ల్యూపస్‌ ఏరితమోటోసిస్‌, ఇంఫ్లమేటరీ బవెల్డిసీస్మొదలైనవి.
స్వయం ప్రతిరక్షక వ్యాధి, శరీరం సహజ రక్షణ వ్యవస్థను కూడా బలహీనపర్చగలదు.
అంతేకాకుండా ఒకేవ్యక్తిలో, ఏకకాలంలో, ఒకటిని మించి స్వయం ప్రతిరక్షక వ్యాధులు ఉద్భవించవచ్చు.
మనదేశంలో స్వయం ప్రతిరక్షకవ్యాధి సంభవనిష్పత్తి ఎంత?
గణాంక సమాచారం మేరకు, ఏడు నుండి పదిశాతం. అయితే మెట్రోనగరాల్లో పద్దెనిమిది వరకు ఉండవచ్చని కొన్ని అధ్యయనాల వలన తేలింది. అందుకు కారణం తీవ్రస్థాయి వాతావరణ కాలుష్యమే అని ఆరోగ్య సంరక్షణ నిపుణుల బలమైన అభిప్రాయం.
చిన్నపిల్లల్లో ఈ వ్యాధులు రావచ్చా?
వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ జబ్బులు వ్యక్తమవచ్చు. ఉదాహరణకు, సిలియాక్‌ డిసీస్‌ అనబడే జబ్బు మూడేళ్ళ లోపు పిల్లల్లో రావచ్చు. అదేవిధంగా టైప్వన్లేదాజువెనైల్‌ మధుమేహం, జువెనైల్‌ ఆర్తరైటిస్‌, లూపస్‌ అనే జబ్బులు కూడా బాల్యం కౌమారం దశలో వ్యక్తమవచ్చు.
జబ్బు నిర్ధారణ ఎలా?
వైద్య నిపుణులకు స్వయం ప్రతిరక్షక వ్యాధి నిర్ధారణ చాలా పెద్ద సవాలు. లక్షణాలని బట్టి పరీక్షలు నిర్వహించి ఈ జబ్బులను నిర్ధారణ చేస్తారు. ఈ క్రమంలో సీబీపీ, ఈఎస్‌ఆర్‌, అంటిన్యూక్లియర్‌ ఆటో అంటీబాడీస్‌, కంప్రెహెన్సివ్‌ మెటబోలిక్పానెల్‌, ఎక్స్రే, ఎంఆర్‌ఐ, పెట్స్కేన్స్‌, మూత్రపరీక్ష, థైరాయిడ్‌కి సంబంధించిన పరీక్షలు, బయాప్సీ ఇలా చాలా రకాల పరీక్షలు చేయవలసి రావచ్చు. తగు వైద్యనిపుణుల సంప్రదింపు, ఓపికతో కూడిన మూల్యాంకనం, సకాల, సరైన పరీక్షల నిర్వహణ, అన్వయం ఈ జబ్బుల నిర్ధారణకు, నిర్వాహకానికి ఎంతో అవసరం.
నివారణ సాధ్యమా?
వ్యాధుల గురించి సమగ్ర అవగాహన లేనందున, అంటువ్యాధుల లాగా నివారణ పూర్తిగా సాధ్యం కాదు.
కానీ, ఈ వ్యాధుల ప్రమాదకారకాల జాబితాలో ఉన్నవారు పౌష్టిక, సమతుల్య ఆహారం తీసుకొంటూ, శరీరబరువును వయసుకు తగ్గట్టుగా పాటిస్తూ, మానసిక ఒత్తుడులను తగ్గించుకొనే జీవనశైలిని అలవర్చుకుని, శ్రమకు తగినంతగా విశ్రాంతి, ఆరు నుండి ఏడు గంటల పాటు నిరంతరాయ నిద్ర, పొగ పీల్చడం, తాగటం- వీటికి దూరంగా ఉండటం, కాలుష్యభరిత పరిసరాలకి దూరంగా, ప్రకతి సామీప్యంలో జీవించే ప్రయత్నం చేయడం వంటి ఆరోగ్య నియమాలు పాటించడం వలన వీటి వ్యక్తీకరణాన్ని, ఉధతాన్ని కొంతవరకు అరికట్టవచ్చు.
అంతే కాకుండా, విటమిన్‌డి, కె టు, జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం మొదలైన పోషక అనుబంధాలను క్రమం తప్పకుండ తీసుకొంటూ, అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ, కారకాలను గుర్తించి, ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ వహించుకుంటూ, తమలోనో, తమ ఆత్మీయుల్లోనో ఈ వ్యాధుల లక్షణాలపట్ల చైతన్యవంతమై, వెంటనే నిపుణులను సంప్రదించి, రోగనిర్ములన వైపు సతర్కమైన అడుగులు వేయడమే రోగనిరోధక చర్యగా చేపట్టాలి.
ఈ వ్యాధుల చికిత్స?
ఈ జబ్బులను పూర్తిగా నయం చేసే చికిత్సలు ఇంకా అందుబాటులో లేవు. నిపుణులకు వ్యాధి నిర్ధారణ, నిర్వహణ రెండూ చాలా పెద్ద సవాళ్లు. ప్రస్తుత చికిత్సా ప్రణాళికలతో తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. వ్యాధిని బట్టి వివిధరకాల చికిత్సలు అవసరం పడవచ్చు. కొన్నిటిని కొంతమేరకు నయం చేయవచ్చు, మరికొన్నిటిని అరికట్టవచ్చు.
డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -