Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుముంపు ముప్పును తప్పించండి

ముంపు ముప్పును తప్పించండి

- Advertisement -

శాశ్వత చర్యలు చేపట్టండి
హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక పర్యటన
బస్తీల్లో ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి
ప్రజల సహకారాన్ని కోరండి : ముఖ్యమంత్రి ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ముంపు నివారణ, పునరుద్ధరణ చర్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమిని గుర్తించి, సంబంధిత అధికారులకు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో గడచిన నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక బస్తీల్లోకి వరద నీరు చేరింది. ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడ్డారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), హైడ్రా, రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి బల్కంపేట, అమీర్‌పేట మైత్రివనం, బుద్ధనగర్‌, గంగూబాయి బస్తీ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి కలియతిరిగారు. గల్లీల్లో తిరుగుతూ వరద ముంపు వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. వర్షం నీరు కాలువల్లోకి ఎందుకు రావట్లేదని అక్కడి అధికారుల్ని ప్రశ్నించారు. బుద్ధ నగర్‌ వద్ద కాలనీ రోడ్ల కంటే ఎత్తులో నాలాపై బ్రిడ్జి నిర్మించిఉండటాన్ని గమనించి, అలాగైతే నీరు నాలాలోకి ఎలా వెళ్తుందని అడిగారు. దీనితో అధికారులు సమాధానం చెప్పేందుకు తడబడ్డారు. కాలనీ రోడ్లకంటే నాలాలపై వేసే శ్లాబులు ఎత్తుగా ఉండటం వల్లే ఇండ్లలోకి వర్షం నీరు వస్తున్నదని స్థానికులు కూడా సీఎంకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులు చేపట్టేటప్పుడు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని ఈ సందర్భంగా సీఎం జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారుల్ని ప్రశ్నించారు. నాలాల్లో పూడికతీత పనులు ఎప్పుడు చేపట్టారని ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలను దగ్గరకు పిలిపించుకొని, వారి సాదకబాదకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు స్థానికులు వరద నీరు సాఫీగా వెళ్లకుండా గంగూబాయిబస్తీ వద్ద కొందరు నాలాలను పూడ్చేసి, ఆక్రమిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ‘అక్కడికి వెళ్దాం పదండి’ అంటూ స్థానిక ప్రజలు, అధికారులతో కలిసి గంగూ బాయి బస్తీకి వెళ్లారు. అక్కడ నాలాపై అక్రమ నిర్మాణాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం అక్కడి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు.

బుద్ధనగర్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులతో సీఎం మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగారు. జీతాలు ఇస్తున్నారా అని ఆరా తీసారు. అక్కడ డ్రైనేజీలో పూడిక తీస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పనిని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో నిమగమై, సీఎంను పట్టించుకోకుండా పూడిక తీస్తుండటంతో స్థానిక అధికారి ఒకరు వారిని పని ఆపమనిచెప్పారు. దీంతో సీఎం సదరు అధికారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘వారి పని వారిని చేయనివ్వండి. పనులు ఆపొద్దు’ అని అక్కడే నిలబడి డ్రైనేజీల్లోంచి తీస్తున్న పూడిక పనుల్ని పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనీ, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వరద నీరు భారీగా నిలిచిపోయిన మైత్రీవనం చౌరస్తాలో పర్యటించారు. నీరు నిలువడానికి కారణాలు ఏంటని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు వచ్చినప్పుడు నీరు సాఫీగా నాలాల ద్వారా వెళ్లిపోయేలా చూడాలనీ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యటనలో కొందరు మహిళలు సీఎంకు రాఖీలు కట్టారు.

‘ఎక్స్‌’లో సీఎం పోస్ట్‌
”బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్‌, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించాను. భారీ వర్షాల సమయంలో కాలనీల్లోని ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా నీటి ప్రవాహం వెళ్లిపోయి, ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాను. భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యచరణపై అధికారులకు పలు సూచనలు చేశాను. బస్తీ వాసులతో మాట్లాడి సాధకబాధకాలు నేరుగా అడిగి తెలుసుకున్నాను” అని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఫోటోలను పోస్ట్‌ చేశారు. దానికి ‘ప్రజాపాలన. తెలంగాణ ప్రజా ప్రభుత్వం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

ప్రజలు ఇబ్బంది పడొద్దు : ఇన్‌చార్జి మంత్రి పొన్నం సమీక్ష
వర్షాకాలం పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారంనాడాయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు, సీజనల్‌ వ్యాధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు జీహెచ్‌ఎంసీి, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, లోతట్టు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాలాల నిర్వహణ, డ్రైనేజీల్లో పూడికలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

బాలుడితో మాటా ముచ్చట
అమీర్‌పేటలోని బుద్ధనగర్‌లో పర్యటిస్తుండగా అటుగా వెళ్తున్న ఏడవ తరగతి విద్యార్థి జశ్వంత్‌ను సీఎం దగ్గరకు పిలిచారు. భుజం మీద చెయ్యివేసి, మాట్లాడుతూ ఆ బస్తీలో తిరిగారు. వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన ఇబ్బందులు ఏంటని ఆ బాలుడిని ప్రశ్నించారు. ఇంట్లోకి వరదనీరు రావడంతో పుస్తకాలు తడిసిపోయాయని జశ్వంత్‌ సమాధానం చెప్పారు. ఆ బాలుడి తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జశ్వంత్‌ కూడా సీఎంతో సరదాగా నవ్వుతూ, తమ బస్తీలోని సమస్యల్ని ఏకరువు పెట్టాడు. ఆ బాలుడి చొరవకు సీఎం ముగ్ధుడై బాగా చదువుకోవాలని చెప్పారు. ఇకపై ఇండ్లలోకి వర్షం నీరు రాకుండా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఆ కాలనీ అంతా కలియతిరిగారు. కొన్నిచోట్ల ప్రజలు సీఎంతో తమ సమస్యలు చెప్పుకొనేందుకు ముందుకు వచ్చారు. సీఎం భద్రతాసిబ్బంది వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో అలా చేయోద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి వారిని వారించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రత్నాకర్‌, అమీర్‌పేట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సరళ, సోమాజిగూడ కార్పొరేటర్‌ వనం సంగీత శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img