Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోమూర్ లో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సు

సోమూర్ లో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ పటేల్ కు చెందిన 3 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటపై అగ్రికల్చర్ ఆఫీసర్స్ రాజు, రామకృష్ణలు అవగాహన కల్పించారు. వీరితో పాటు హిందుస్తాన్ యూనిలీవర్ ఏరియా మేనేజర్ మోహన్, ఫీల్డ్ ఆఫీసర్ సాయిప్రసాద్, మద్నూర్ మండలానికి చెందిన పలువురు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఉధ్యానవన పంటల్లో అత్యధికంగా ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటకు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, మొక్కలు, డ్రిప్ సిస్టమ్, అంతర పంటలు, ఆయిల్ ఫామ్ నిర్వహణకు కలిపి ఎకరానికి సుమారు రూ.52,000 వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మండలంలో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ మద్నూర్ మండల రైతులు చాలా తెలివైనవారని, ఒకే పంటపై ఆధారపడకుండా కొత్త కొత్త పంటలను త్వరగా స్వీకరిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పంటను కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందుస్తాన్ యూనిలీవర్ ఏరియా మేనేజర్ మోహన్  మాట్లాడుతూ హిందుస్తాన్ యూనిలీవర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ అని తెలిపారు. ఈ నెల నుండే ఆయిల్ పామ్ గెలల సేకరణ ప్రారంభించామని చెప్పారు. దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ డ్రిప్ సబ్సిడీతో పాటు రైతుల తరఫున కంపెనీ కూడా ఎకరానికి రూ.5,000 ను డ్రిప్ కంపెనీకి డీడీ రూపంలో చెల్లిస్తున్నామని తెలిపారు.

కాబట్టి ఆయిల్ ఫామ్ సాగు చేయదలచిన రైతులు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ  2022 డిసెంబర్ నెలలో 3 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు ప్రారంభించానని, ప్రస్తుతం తన తోటలో గెలలు కోతకు వచ్చాయని తెలిపారు. ఇతర రైతులు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -