– జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
నవతెలంగాణ – రాయపర్తి
రైతులు నానో యూరియాపై అవగాహన పెంచుకొని లాభసాటి వ్యవసాయం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పండించాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్ తో నానో యూరియా పిచికారి చేసే విధానాన్ని డెమో చేసి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియా బస్తాకి సమానమని, పనిచేసే సామర్ధ్యం కూడా నానో యూరియాకు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇది చాలా సులువుగా చాలా రకాల పురుగుమందులు, నానో డీఏపీ, నానో యూరియా, నానో జింక్ తో కలిపి పిచికారి చేసుకోవచ్చని తెలియచేశారు.
రైతులు 30 రోజుల తర్వాత నానో యూరియాను వాడుకోవచ్చని, డ్రోన్ల ద్వారా కాని చేతి పంపుల ద్వారా కాని పిచికారీ చేసుకోవచ్చన్నారు. ధర కూడా యూరియా బస్తా కంటే తక్కువగానే ఉంటుందన్నారు. ఖర్చు కూడా ఆదా అవుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల్లో పెద్ద ఎత్తున నానో యూరియా వాడకంపై శ్రద్ధ చూపేలా అవగాహన పెంచాలని డీలర్లకు, అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రం, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నానో యూరియాపై అవగాహన పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES