ఏఐసీసీ గ్రీన్ సిగల్
ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన
రాజ్‌భవన్‌లో శుక్రవారం ప్రమాణ స్వీకారం?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్ణయానికి ఏఐసీసీ గ్రీన్ సిగల్ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత, ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
ఆ నివేదిక క్ల్లియర్ అయినా, కాకపోయి నా ఆయన మంత్రి పదవి చేపట్టవచ్చు. కాకపోతే ఆరు నెలల్లో ఎమ్మెల్సీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నికై ఉండాలి. లేకపోతే ఆయన మంత్రి పదవి కోల్పోతారు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా అజహరు ద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా ఉన్న మైనార్టీల ఓట్లు గంపగుత్తగా రాబట్టేందుకు వీలుగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టాలనేది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. మంత్రి వర్గ విస్తరణపై కొన్ని రోజులుగా ఏఐసీసీ కసరత్తు చేసింది. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీన్‌కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. మరో రెండు మంత్రిపదవులు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. అజహరుద్దీన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయినా తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అందులో మొదటిసారి ముఖ్యమంత్రితోపాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించింది. ఒక వేళ గవర్నర్ కోటాలో అజాహరుద్దీన్‌కు అవకాశం దక్కకపోతే త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానంలో ఒకటి ఆయనకు కేటాయిస్తున్నారని తెలిసింది. ఇంకా మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు ఏయే సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డికి అజహరుద్దీన్ కృతజ్ఞతలు
తనను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అజహరుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన్ను ఈమేరకు మర్యాదపూర్వకంగా కలిశారు.



