Thursday, April 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమళ్లీ మొదటికి..

మళ్లీ మొదటికి..

- Advertisement -

సీజ్‌ఫైర్‌ ప్రకటించిన కొద్దిసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ విధ్వంసకాండ
వందలసంఖ్యలో మృతులు
సీరియస్‌గా తీసుకున్న ఇరాన్‌
హార్ముజ్‌ జలసంధి మళ్లీ మూసివేత
కాల్పుల విరమణపై అనిశ్చితి
ట్రంప్‌, నెతన్యాహు డబుల్‌గేమ్‌

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్‌ఫైర్‌పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. రెండు వారాల పాటు యుద్ధ విరమణకు ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ, పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు తీవ్రతరం చేసింది. భారీ వైమానిక దాడులతో జనావాసాలపై విరుచుపడింది. వందల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. క్షతగాత్రులను తరలించటానికి ఆస్పత్రులు కూడా సరిపోవటంలేదని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ దుశ్చర్యను సీరియస్‌గా తీసుకున్న ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఐతే పాకిస్తాన్‌లో జరగనున్న చర్చలకు అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌ హాజరవుతారని వైట్‌హౌస్‌ ప్రకటించింది.

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌ (టెహ్రాన్‌)
లెబనాన్‌లో హిజ్బుల్లాతో పాటు అమాయక ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న విధ్వంసకాండపై ఇరాన్‌ను తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సీజ్‌ఫైర్‌ ఒప్పందం మంగళవారం నుంచి ప్రారంభమైనప్పటికీ, అది అన్ని ప్రాంతాలకు వర్తించదని ఇజ్రాయిల్‌ స్పష్టం చేసింది.ఈ ఒప్పందంలో లెబనాన్‌ భాగం కాదని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసిన స్వల్ప వ్యవధిలోనే ఇజ్రాయిల్‌ దళాలు లెబనాన్‌పై భారీ విధ్వంసకాండకు తెగబడ్డాయి.దీంతో ఇరాన్‌ కూడా హార్ముజ్‌ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఓవైపు సీజ్‌ఫైర్‌ అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నెతన్యాహును కట్టడి చేయటంలో విఫలమయ్యారు. దీంతో యుద్ధ పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పీస్‌ ఆఫ్‌ బోర్డు ఏర్పాటు చేశాక కూడా నెతన్యాహు గాజాపై విరుచుకుపడుతున్న విషయం విదితమే. అదే తరహాలో లెబనాన్‌పై కూడా విధ్వంసానికి తెగబడుతున్నారు. ఈ చర్యలు మరోవైపు పాకిస్తాన్‌లో జరగనున్న చర్చలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తాత్కాలిక ఉపశమనం పొందిన మధ్యప్రాచ్యం మళ్లీ నెత్తుటేరుల వైపు పయనిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో సువర్ణాధ్యాయం : ట్రంప్‌
ఇదిలావుండగా కాల్పుల విరమణపై ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. ‘ఇరాన్‌ను ధ్వంసం చేసేందుకు దళాలను పంపాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అయితే హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా, తక్షణమే స్వయంగా తెరిచినప్పుడే మా దాడులు ఆగిపోతాయి. ఇది ప్రపంచ శాంతికి గొప్ప రోజు. హార్ముజ్‌ను తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది. ఆ జలసంధిలో నౌకల రవాణాను సులభతరం చేయడానికి అమెరికా సాయపడుతుంది. యుద్ధం ఆగిపోవాలని యావత్‌ ప్రపంచం కోరుకుంది. కాల్పుల విరమణ కోసం పెట్టిన రెండు వారాల గడువు ఇరాన్‌తో శాశ్వత ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ ప్రాంతంలో ఇక సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోంది.

సానుకూల చర్యలతో వాణిజ్య పరంగా ముందడుగు వేయడానికి ఇరాన్‌కు ఇది మంచి అవకాశం. ఇరాన్‌ తన పునర్నిర్మాణ పనులను మొదలు పెట్టవచ్చు. ఈ విషయంలో మేము తప్పకుండా సాయం చేస్తాం. అమెరికా లాగానే ఇరాన్‌కూ మంచి రోజులు రాబోతున్నాయి’ అని ట్రంప్‌ వివరించారు. కాల్పుల విరమణకు ఇరాన్‌ను అంగీకరింపజేయడంలో చైనా పాత్ర ఏమైనా ఉన్నదా అని పాత్రికేయులు ప్రశ్నించగా ‘ఆ విషయాన్ని నేనూ విన్నాను. చైనా ప్రమేయం ఉండవచ్చునని అనుకుంటున్నాను’ అని చెప్పారు. వచ్చే నెలలో ట్రంప్‌ చైనాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ట్రంప్‌, శక్తివంతమైన అమెరికా సైన్యం కారణంగానే హార్మూజ్‌ను తిరిగి తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించిందని అమెరికా చెప్పుకుంటోంది.

ఒప్పందానికి ఓకే కానీ..: ఇజ్రాయిల్‌
రెండు వారాల పాటు కాల్పులకు స్వస్తి చెప్పేందుకు ఇజ్రాయిల్‌ కూడా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని తేల్చి చెప్పింది. హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ తాజాగా దక్షిణ లెబనాన్‌పై దాడులు చేసింది. ఇరాన్‌ ప్రతిపాదించిన పది సూత్రాలలో లెబనాన్‌పై దాడుల నిలిపివేత అంశం కూడా ఉంది. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందంపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెత న్యాహూ కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ట్రంప్‌ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం. ఇరాన్‌ నుంచి ప్రపం చానికి ప్రమాదం ఏర్పడకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్ధిస్తున్నాం. ఇరాన్‌తో చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చల సందర్భంగా అమెరికా, ఇజ్రాయిల్‌, వాటి మిత్ర దేశాల లక్ష్యాలను సాధించేందుకు కట్టుబడి ఉంటానని అగ్రరాజ్యం హామీ ఇచ్చింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు’ అని ఆ ప్రకటన తెలియజేసింది.

ఆగని దాడులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ గల్ఫ్‌లోని సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, కువైట్‌లలో క్షిపణి అలర్ట్స్‌ జారీ చేశారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని ఆయా దేశాలు తెలియజేశాయి. లావన్‌ దీవిలో ఉన్న చమురు రిఫైనరీపై బుధవారం ఉదయం 10 గంటలకు దాడి జరిగిందని ఇరాన్‌ తెలిపింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.

నౌకలపై రవాణా పన్ను
హార్ముజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలపై ఇరాన్‌, ఒమన్‌ దేశాలు రవాణా పన్ను విధిస్తాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ నిబంధనను చేర్చారు. 34కిలోమీటర్ల వెడల్పున్న హార్ముజ్‌ జలసంధి ఒమన్‌, ఇరాన్‌ ప్రాదేశిక జలాల పరిధిలో ఉంది. దీనిని అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ ఈ మార్గంలో నౌకాయానంపై ఏ దేశమూ టోల్‌ విధించలేదు. రవాణా పన్ను వసూలు ద్వారా సమకూరే సొమ్మును యుద్ధానంతర ఇరాన్‌ పునర్నిర్మాణానికి వినియోగిస్తామని అధికారులు తెలిపారు. అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధం కారణంగా ఇరాన్‌ రక్షణ, పరిపాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. నౌక రకాన్ని బట్టి పన్నును నిర్ణయిస్తారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. అయితే చమురు రవాణా నౌకలపై పన్ను విధించడాన్ని యూఏఈ, ఖతార్‌ సహా గల్ఫ్‌ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

యుద్ధం ముగిసిపోలేదు..మా వేళ్లు ట్రిగ్గర్‌ పైనే : మొజ్తాబా
కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాడులను ఆపేయాలని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ తన దళాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదని, కాబట్టి అందరూ అప్రమత్తం గా ఉండాలని సూచించారు. మొజ్తాబా ప్రకటనను ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌లో చదివి వినిపించారు. ‘సుప్రీం నేత ఆదేశా లను అన్ని సైనిక విభాగాలు పాటించాయి. దాడులు నిలిపివే శాయి. కాల్పు ల విరమణ అంటే యుద్ధం ఆగిపోయినట్టు కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌ పైనే ఉన్నాయి.

శత్రువులు మళ్లీ దురాక్ర మణకు పాల్పడితే తగిన విధంగా బదులిస్తాం’ అని ఇరాన్‌ టీవీ తెలిపింది. కాగా తాను సూచించిన పదిహేను సూత్రాల ప్రతిపాదనపై చర్చించాలంటూ అమెరికా చేసిన అభ్యర్థనను పరిశీలించేందుకు ఇరాన్‌ అంగీకరించింది. సాంకేతిక పరిమితుల పరిశీలన, ఇరాన్‌ సాయుధ దళాలతో సమన్వయం ద్వారా హార్ముజ్‌లో నౌకలు సురక్షితంగా ప్రయాణించడం సాధ్యమేనని తెలిపింది. ఈ ఒప్పందం టెహ్రాన్‌ విజయమేనని చెప్పింది. శత్రుత్వాన్ని వీడేందు కు తాము విధించిన షరతులకు అమెరికా అంగీకరించిందని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ తెలియజేసింది.

ట్రంప్‌… తప్పుకో : అమెరికా కాంగ్రెస్‌ సభ్యుల డిమాండ్‌
ఈ రాత్రి ఇరాన్‌ సర్వనాశనం అవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం చేసిన హెచ్చరికపై ప్రతి నిధిసభకు చెందిన యాభై మందికి పైగా డెమొక్రటిక్‌ సభ్యులు మండిపడ్డారు. ట్రంప్‌ రాజీనామా చేయాలని, లేకుంటే ఆయనను అభిశంసించి పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ను అభిశంసించాలని, లేకుంటే ఇరవై ఐదవ సవరణ ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించాలని స్పష్టం చేశారు. గతంలో వెనిజులా పైన, ఇప్పుడు ఇరాన్‌ పైన ట్రంప్‌ చేసిన దాడుల నేపథ్యం లో ఆయనను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి యాభై మందికి పైగా డెమొక్రాట్లు, ఇద్దరు సెనెటర్లు ఈ డిమాండును ముందుకు తెచ్చారు. అధికారాలు, విధులు నిర్వర్తించడంలో విఫలమైన దేశాధ్యక్షుడిని పదవి నుంచి తాత్కాలికంగా తొలగించడానికి అమెరికా రాజ్యాంగంలోని ఇరవై ఐదవ సవరణ ఉపాధ్యక్షుడిని, మెజారిటీ క్యాబినెట్‌ మంత్రులను అనుమతిస్తోంది.

అంతకు ముందు..
నలభై రోజులుగా దాడులు, ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో తాత్కాలికంగా శాంతి నెలకొనే ప్రయత్నాలు జరిగాయి. రెండు వారాల పాటు కాల్పుల విరమణ పాటించి, సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు ఇరాన్‌, అమెరికా అంగీకరించాయి. హార్ముజ్‌ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను సర్వ నాశనం చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌…తాను విధించిన గడువుకు రెండు గంటల ముందు వెనక్కి తగ్గారు. ఇరాన్‌ ప్రతిపాదించిన పది సూత్రాల శాంతి ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించారు. అటు ఇరాన్‌ కూడా షరతులకు లోబడి హార్ముజ్‌ జల సంధిని తెరిచేందుకు అంగీకరించింది. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన దిశగా శుక్రవారం పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్‌ మధ్య చర్చలు జరుగు తాయి. కాగా ఒప్పందం మేరకు హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవడంతో కొన్ని నౌకలు ప్రయాణాన్ని ప్రారంభించాయని తెలుస్తోంది.

శాంతి పరిరక్షణకు ఇరాన్‌ పది సూత్రాలు
మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడానికి తమ నిబద్ధతను ప్రకటిస్తూ, ఇరాన్‌ పది సూత్రాల ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. పాకిస్తాన్‌ ద్వారా అమెరికాకు పంపిన ఈ ప్రతిపాదనలలో, ఈ ప్రాంతంలో తమ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడుకోవడానికి ఇరాన్‌ రాజీలేని డిమాండ్లను చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తే, గల్ఫ్‌ ప్రాంతమంతటా తమ సైన్యం కూడా ప్రతీకార చర్యలను ఆపివేస్తుందని ఇరాన్‌ పేర్కొంది.

మధ్యప్రాచ్యంలో ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణకు సానుకూలంగా స్పందిస్తూనే, తమ వైఖరిలో దఢంగా ఉంటామని ఇరాన్‌ తెలిపింది. ఇరాన్‌ ముందుకు తెచ్చిన ప్రతిపాదనలలోని ప్రధాన డిమాండ్లు:
-మధ్యప్రాచ్యంలోని అన్ని సైనిక స్థావరాల నుండి అమెరికా బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నది ఇరాన్‌ ప్రధాన డిమాండ్‌.
-మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై సైనిక చర్యలను కాలపరిమితి లేకుండా శాశ్వతంగా నిలిపివేయాలి.
-మధ్యప్రాచ్యంలో ఇరాక్‌, లెబనాన్‌ , యెమెన్‌లపై అమెరికా , దాని మిత్రదేశాలు విధించిన చమురు ఆంక్షలను తక్షణమే మరియు పూర్తిగా ఎత్తివేయాలి.
-మధ్యప్రాచ్యంలో ప్రపంచంలోని ప్రధాన చమురు రవాణా మార్గమైన హార్ముజ్‌ జలసంధిని తెరవాలి.
-మధ్యప్రాచ్యంలో హార్ముజ్‌ జలసంధి గుండా జరిగే రవాణాను, ఇరాన్‌ సాయుధ దళాలతో సమన్వయం చేసుకునే ఒక నియంత్రిత వ్యవస్థ కిందకు తీసుకురావాలి. ఈ జలాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఈ చర్య అత్యవసరమని ఇరాన్‌ స్పష్టం చేసింది.

-అమెరికా-ఇజ్రాయిల్‌ సంకీర్ణ దళాల వైమానిక దాడులు, దండయాత్రల వల్ల కలిగిన అన్ని నష్టాలకు ఇరాన్‌కు పూర్తి పరిహారం చెల్లించాలి.
-ఇరాన్‌ వాణిజ్య, ఆర్థిక రంగాలను పట్టిపీడిస్తున్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి.
-అమెరికా ఒత్తిడి కారణంగా విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులన్నింటినీ తక్షణమే విడుదల చేయాలి.
-తాము అణ్వాయుధాలను నిర్మించబోమని ఇరాన్‌ తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటిస్తుందని కూడా ఈ ఒప్పందంలో పేర్కొంది.
-ఈ షరతులను అంగీకరిస్తే, అమెరికాతో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని కూడా ఇరాన్‌ పేర్కొంది.
అమెరికా, ఇజ్రాయిల్‌ల బెదిరింపులకు తలొగ్గకుండా, తన సొంత గడ్డపై తన హక్కులను కాపాడుకుంటూ ఇరాన్‌ ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. కేవలం రెండు వారాల కాల్పుల విరమణకు మించి, మధ్యప్రాచ్యంలో సామ్రాజ్యవాద జోక్యాలకు శాశ్వత పరిష్కారం కావాలన్న ఇరాన్‌ వైఖరి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -