Monday, December 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమళ్ళీ హస్తానికే..

మళ్ళీ హస్తానికే..

- Advertisement -

రెండోవిడత పంచాయతీ పోరులో 2,241 మంది కాంగ్రెస్‌ మద్దతుదారుల గెలుపు
బీఆర్‌ఎస్‌ 1,186, బీజేపీ 268, ఇతరులు 624
నల్లగొండ, కామారెడ్డిలలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌
సిద్దిపేట, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం
పోటెత్తిన ఓటు..85.86 పోలింగ్‌
అత్యధికంగా భువనగిరిలో 91.72 శాతం
అత్యల్పంగా నిజామాబాద్‌లో 71.79

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండోవిడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. మొదటి విడతలో అత్యధిక స్థానాలు గెలుచుకుని జోష్‌ మీదున్న ఆపార్టీ.. రెండో విడతలోనూ మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుంది. ఆదివారం జరిగిన పోలింగ్‌లో 3,911 సర్పంచ్‌ స్థానాలకు 12,782 మంది, 29,917 వార్డు స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తుది వార్తలు అందే సమయానికి కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 2,241 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన అభ్యర్థులు 1,186 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 268 చోట్ల, ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు. నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ సత్తా చాటింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందారు. సిద్దిపేట, కుమరంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని కనబర్చింది.

మెదక్‌, రంగారెడ్డి, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఆ పార్టీ మద్దతు దారులు గట్టి పోటీ ఇచ్చారు. నిర్మల్‌ జిల్లాలో అనూహ్యంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ మద్దతుదారులు మెజార్టీ స్థానాలను దక్కించుకు న్నారు. అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు రెండంకెల మార్కును దాటారు. మొదటి రెండు విడతల్లో కాంగ్రెస్‌ అభ్యర్థు లు మెజార్టీ స్థానాలను దక్కించుకోగా, బీఆర్‌ఎస్‌ రెండవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన 80 శాతానికి పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాలను ఇండిపెండెంట్లు 15 శాతం, బీజేపీ 5 శాతంగా నిలిచారు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీ 50 శాతం వరకు స్థానాలు దక్కించుకోగా, బీఆర్‌ఎస్‌ 25 శాతం, ఇతరులు 25 శాతం స్థానాల్లో పాగా వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం, మరో మూడేండ్లు గడువున్న నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. చివరి విడతలోనూ మొదటి, రెండో విడత ఫలితాలే పునరావృతం అవుతాయని భావిస్తున్నారు.

రెండో విడతలో పెరిగిన పోలింగ్‌
రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. మొదటి విడతలో 84.28 శాతం నమోదు కాగా, ఈ సారీ 1.58 శాతం పెరిగి 85.86 శాతంగా నమోదైంది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం రెండో దశ పోలింగ్‌ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 193 మండలాల్లోని 3,911 పంచాయతీలు, 71,071 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 91.21, సూర్యపేటలో 89.56, మెదక్‌లో 88.80 శాతం పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యల్పంగా నిజామాబాద్‌ జిల్లాలో 76.71 శాతం, ఆ తర్వాత జగిత్యాలలో 76.34, భద్రాది కొత్తగూడెంలో 82.65, నిర్మల్‌లో 82.67 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు కొంత మందకొడిగా సాగింది. మొదటి రెండు గంటల్లో 22.54 పోలింగ్‌ నమోదు కాగా, అ తర్వాత 9 నుంచి 11 గంటల వరకు 56.71 శాతం ఓటింగ్‌ నమోదైంది. 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చివరి వరకు మొత్తం 85.86 శాతానికి చేరుకుంది. ఏకగ్రీవం, నామినేషన్‌ దాఖలు కాని గ్రామాలను మినహయిస్తే మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 22,77,902 మంది పురుషులు (85.71 శాతం), 23,93,010 మంది మహిళలు (86 శాతం), 60 మంది ఇతరులు (41.96 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -