Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీ అల్లర్ల కేసులో ఖాలిద్‌, ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరణ

ఢిల్లీ అల్లర్ల కేసులో ఖాలిద్‌, ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరణ

- Advertisement -

మరో ఐదుగురికి విముక్తి
వీరిద్దరిపై అభియోగాలు భిన్నమైనవంటూ సుప్రీం వ్యాఖ్య


న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఇదే కేసులో నిందితులైన మరో ఐదుగురికి మాత్రం సుప్రీం ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది.”ఈ కుట్ర కేసులో ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌ నేరానికి పాల్పడినట్టు బలమైన ఆధారాలున్నాయి. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు భిన్నమైనవి. ఇలాంటి దశలో వారికి బెయిల్‌ ఇవ్వడం సరైన నిర్ణయం కాదు” అని సుప్రీంకోర్టు వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ అల్లర్లలో 53 మంది దుర్మరణం చెందగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌శర్మ కూడా హత్యకు గురయ్యారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద చార్జిషీటు నమోదు చేశారు. వీరిలో కొందరికి గతంలో బెయిల్‌ లభించింది. ఉమర్‌ ఖాలిద్‌, శర్జీల్‌ ఇమామ్‌ సహా ఏడుగురి నిందితుల బెయిల్‌ను గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 10న తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఖాలిద్‌, ఇమామ్‌కు బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది. మరో ఐదుగురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్‌ హైదర్‌, షిఫా ఉర్‌ రహమాన్‌, మహ్మద్‌ సలీమ్‌ ఖాన్‌, షాదాబ్‌ అహ్మద్‌కు కోర్టు ఊరట కల్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -