హౌరా హౌరీగా సాగిన వేలం పాట
ఆరేండ్లుగా ఎదురుచూస్తున్నా : లింగాల దశరథగౌడ్
నవతెలంగాణ-బడంగ్‌పేట్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో ఈ ఏడాది అనేక మంది పాల్గొన్నారు. హౌరా హౌరీగా సాగిన వేలం పాటలో హైదరాబాద్ కర్మన్‌ఘట్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నాయకులు లింగాల దశరథగౌడ్ రూ.35 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్నారు. 2024లో బాలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది కంటే ఈ సంవత్సరం లడ్డు రూ.4.99 లక్షలు అధికంగా పలికింది.
రూ. 1016 నుంచి వేలం పాట ప్రారంభం
నవరాత్రి పూజలు అందుకున్న బాలాపూర్ విఘ్నేశ్వరుడికి శనివారం ఉదయం 4 గంటల 5 నిమిషాలకు చివరి పూజ చేశారు. ఐదు గంటలకు బాలాపూర్ గ్రామ పురవీధులలో ఆట పాటలు భజన చేస్తూ.. నాట్య బృందాలతో డప్పు వాయిద్యాలతో శోభాయాత్ర నిర్వహించి గ్రామ బొడ్రాయి వరకు తీసుకొచ్చారు. దాదాపు 5 గంటలపాటు ఊరేగింపు కొనసాగింది. బొడ్రాయి వద్ద వంగేటి లక్ష్మారెడ్డి లడ్డు రూ.1016తో వేలం పాటను ప్రారంభించారు. వేలం పాటలో దాదాపు 38 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. అందులో 8 మంది ప్రముఖంగా నిలిచారు. చివరకు లింగాల దశరథ గౌడ్ లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేండ్లుగా లడ్డు కోసం ఎదురుచూస్తున్నానని, ఈసారి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మెన్ తీగల అనితారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీ సామల రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలాపూర్ గణేష్ లడ్డు రూ.35 లక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES