– పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
– పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహౌత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఆషాఢ మాసం తొలి మంగళవారం కల్యాణ వేడుకను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్దసంఖ్యలో జనం తరలిరాగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి కల్యాణాన్ని తిలకించారు. కల్యాణ మహౌత్సవానికి వచ్చిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలకు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ఆలయ చైర్మెన్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. తాగునీరు, విద్యుత్ నిరంతరంగా అందుబాటులో ఉంచగా.. సందర్శకులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి కల్యాణం తిలకించేలా, దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేపట్టారు. కల్యాణ మహౌత్సవంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఫిషరీష్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, సమాచార శాఖ కమిషనర్ సిహెచ్.ప్రియాంక, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES