మానవతా సంస్థలపై ఇజ్రాయిల్ వేటు
వైద్యం, నిత్యావసరాలు అందక పాలస్తీనియన్ల విలవిల
గాజా : కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ గాజాలో ఇజ్రాయిల్ దాష్టీకాలు ఆగడం లేదు. సహాయ గ్రూపులకు తాను విధించిన నూతన నిబంధనలు పాటించని 37 మానవతా సంస్థలపై గురువారం నుంచి వేటు వేస్తానని ఇజ్రాయిల్ ప్రకటించింది. వీటిలో డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్ (ఎంఎస్‌ఎఫ్) కూడా ఉంది. గాజాలో వైద్య సేవలు అందజేస్తున్న ప్రధాన గ్రూపులలో ఇది ఒకటి. గాజా స్ట్రిప్‌లోని 20 శాతం ఆస్పత్రి పడకలకు ఇది మద్దతు ఇస్తోంది. అంతేకాదు…మూడింట ఒక వంతు జననాలకు సేవలు అందిస్తోంది. ఇజ్రాయిల్ నిర్ణయంతో తన కార్య కలాపాలు నిలిచిపోతాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తన సిబ్బందిపై ఇజ్రాయిల్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా నిర్ణయాన్ని పున్ణసమీక్షించుకోవాలని అంతర్జాతీయ, స్థానిక ఎన్‌జీఓల కన్సార్టియం ఇజ్రాయిల్‌ను కోరింది. తన నేరాలకు సాక్షులు ఎవరూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇజ్రాయిల్ గాజాలో సహాయ గ్రూపుల కార్యకలాపాలను అడ్డుకుంటోందని పాలస్తీనా విదేశాంగ శాఖ ఆరోపించింది.
ఈయూ హెచ్చరిక
నూతన రిజిస్ట్రేషన్ నిబంధనలను సాకుగా చూపి గాజాలో అనేక సహాయ బృందాలపై ఇజ్రాయిల్ విధించిన నిషేధాన్ని యూరోపియన్ యూనియన్ తప్పుపట్టింది. పాలస్తీనా ప్రజలకు ప్రాణరక్షణ సాయం అందకుండా ఈ చర్య అడ్డుకుంటుందని హెచ్చరించింది. ‘ఈయూ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రస్తుత రూపంలో ఎన్‌జీఓ రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయకూడదు’ అని ఈయూ మానవతా వాద విభాగం అధిపతి హడ్జా లహ్‌బీబ్ తెలిపారు. కాగా గాజాలో మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. గుడారాలు, కారవాన్ల సరఫరాలను కూడా ఇజ్రాయిల్ అడ్డుకుంటోంది. దీంతో శీతాకాలపు చలిగాలులు వారిని వేధిస్తున్నాయి. ఇటు చంటిపాపలను చూసుకోలేక, అటు బాంబు దాడుల్లో గాయపడిన పెద్దవారి బాగోగులు పట్టించుకోలేక మహిళలు సతమతమవుతున్నారు. వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో క్యాన్సర్ రోగులు మృత్యుముఖంలోకి జారుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇజ్రాయిల్ మారణహోమానికి సాక్ష్యాలు
గాజాలో ఇజ్రాయిల్ సాగించిన మారణహోమం కారణంగా గత రెండేండ్లలో జనాభా 10.6 శాతం తగ్గిపోయిందని పాలస్తీనా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలియ జేసింది. 2023 అక్టోబరులో గాజాపై ఇజ్రాయిల్ పూర్తి స్థాయిలో యుద్ధం మొదలు పెట్టిన తర్వాత నగర జనాభా దాదాపుగా 2,54,000 తగ్గింది. 18,592 మంది చిన్నారులు సహా 70,942మంది చనిపోయారు. వీరిలో 12,400 మంది మహిళలు. సుమారు ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 71,266. క్షతగాత్రులు 1,71,222. ఈ గణాంకాలు గాజాలో ఇజ్రాయిల్ మారణహోమానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇదిలావుండగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయిల్ దళాలు ఇద్దరు పాలస్తీనియన్లను హింసించాయి. మరో నలుగురిని అరెస్ట్ చేశాయి.
పాలస్తీనియన్లను తరిమేసేందుకే…
పాలస్తీనియన్లను నామరూపాలు లేకుండా చేసేందుకే సహాయ బృందాలపై ఇజ్రాయిల్ నిషేధం విధిస్తోందని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గార్డన్ విమర్శించారు. ఇజ్రాయిల్ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆయన చెప్పారు. ఇది పాలస్తీనియన్ల అణచివేతకు ఇజ్రాయిల్ అవలంబిస్తున్న సరికొత్త వ్యూహమని, గాజా స్ట్రిప్ నుంచి వారిని తరిమేయడమే దాని లక్ష్యమని తెలిపారు. ఇదిలావుండగా కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని వారాల ముందు గాజా నగరంలో ఇజ్రాయిల్ అనేక టన్నుల బాంబులను మోహరించిందని వార్తలు వచ్చాయి.



