Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅరుంధతీరారు బుక్‌పై నిషేధం

అరుంధతీరారు బుక్‌పై నిషేధం

- Advertisement -

మరో 24 పుస్తకాలపై కూడా..
జమ్మూకాశ్మీర్‌ యంత్రాంగం ఆదేశాలు
వేర్పాటువాదాన్ని, తప్పుడు కథనాలను ప్రోత్సహిస్తున్నాయంటూ ఆరోపణలు
జమ్మూకాశ్మీర్‌ :
తప్పుడు కథనాలు, వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్నాయన్న ఆరోపణలపై జమ్మూకాశ్మీర్‌ యంత్రాంగం 25 పుస్తకాలపై నిషేధం విధించింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌ హోం డిపార్ట్‌మెంట్‌ ఆదేశాలు జారీచేసింది. బ్యాన్‌కు గురైన వాటిలో ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతిరారు, సుప్రీంకోర్టు మాజీ లాయర్‌, రాజ్యాంగ నిపుణులు ఎ.జి నూరానీ రాసిన పుస్తకాలూ ఉన్నాయి. తప్పుడు కథనాలను ప్రోత్సహిం చటం, వేర్పాటువాదాన్ని ప్రేరేపించటం వంటి ఆరోపణలు ఈ పుస్తకాలపై ఉన్నాయనీ, అందుకే వీటిని ‘జప్తు’ చేసినట్టు జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) నేతృత్వంలోని హోం డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.
అరుంధతిరారు రాసిన ఆజాదీ, నూరానీ రచించిన ‘ది కాశ్మీర్‌ డిస్ప్యూట్‌ 1947-2012’లు నిషేధానికి గురయ్యాయి. అలాగే పొలిటికల్‌ సైంటిస్ట్‌, విద్యావేత్త సుమంత్ర బోస్‌ రచించిన ‘కాశ్మీర్‌ ఎట్‌ ది క్రాస్‌రోడ్స్‌’, జర్నలిస్టు అనురాధా భాసిన్‌ రాసిన ‘ఎ డిస్‌మాంటిల్‌ స్టేట్‌’లు నిషేధిత పుస్తకాల జాబితాలో ఉన్నాయి. కాశ్మీరీ-అమెరికన్‌ రచయిత హఫ్సా కన్‌జ్వాల్‌ రచించిన ‘కలోనైజింగ్‌ కాశ్మీర్‌ : స్టేట్‌-బిల్డింగ్‌ అండర్‌ ఇండియన్‌ ఆక్యుపే షన్‌’ హాలే డస్చిన్స్కీ రాసిన ‘రెసిస్టింగ్‌ ఆక్యుపేషన్‌ ఇన్‌ కాశ్మీర్‌’, విక్టోరియా స్కోఫీల్డ్‌ రచించిన ‘కాశ్మీర్‌ ఇన్‌ కాన్‌ఫ్లిక్ట్‌’, క్రిస్టోఫర్‌ స్నెడ్డెన్‌ రాసిన ‘ఇండిపెండెంట్‌ కాశ్మీర్‌’ వంటి అంతర్జాతీయ పుస్తకాలు కూడా బ్యాన్‌కు గురి కావటం గమనార్హం.
భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సంబంధిత సెక్షన్‌ కింద ఈ పుస్తకాలపై నిషేధాన్ని విధించారు. ఇది పుస్తకాలను సీజ్‌ చేసే అధికారాన్ని పోలీసులకు ఇస్తుంది. జమ్మూకాశ్మీర్‌ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై అనురాధా భాసిన్‌ స్పందించారు. నిషేధానికి గురైన పుస్తకాలు చాలా పరిశోధించబడినవనీ, ఏ ఒక్కటీ కూడా ప్రభుత్వం అంతమైనదిగా చెప్పుకుంటున్న ఉగ్రవాదాన్ని కీర్తించలేదని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. మీ అబద్ధాలను సవాలు చేసే వాస్తవాలకు భయపడుతున్నారంటూ జమ్మూకాశ్మీర్‌ యంత్రాంగం తీరును తప్పుబట్టారు. జమ్మూకాశ్మీర్‌ విషయంలో వాస్తవాలు, కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన అంశాలు బయటకు రాకూడదనే ఇలా పుస్తకాలను నిషేధిస్తున్నారంటూ మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు, రాబోయే తరానికి తెలియకుండా చేయటం సరికాదని అంటున్నారు.

Ban on Arundhati Rao's book
Ban on Arundhati Rao’s book
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img