బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మరింత ముదురుతున్న వివాదం
భారత్‌తో దీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగిస్తున్న దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. విదేశీ విధానాల్లో అతివాద పోకడలతో పొరుగు దేశాల నుంచి భారత్ నిరసన జ్వాలలు చవిచూస్తోంది. ఈ జాబితాలోకి తాజాగా బంగ్లాదేశ్ చేరింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గం వ్యక్తిపై మరో వర్గం మూక దాడితో మొదలైన వివాదం.. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించటంతో ముదిరి పాకాన పడింది. తాజాగా ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢాకా (బంగ్లాదేశ్)
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి తొలగించటంపై తీవ్రంగా స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఈ సీజన్ ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించటం వెనుక ఎటువంటి కారణాలు పంచుకోలేదని తెలుసుకున్నాం. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిషేధిస్తున్నామని ప్రకటించింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఫిరోజ్ ఖాన్ ఈ ప్రకటనపై సంతకం చేశారు. 2008 నుంచి బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి అంతర్జాతీయ క్రికెట్ పోటీల ప్రసారాలను నిలిపివేస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోలేదు. తొలిసారి ఆ దేశం ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
ఎందుకీ నిర్ణయం
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో అనిశ్చితి వాతావరణం నెలకొంది. ప్రజల్లో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరుకోవటంతో తిరుగుబాటు సైతం చోటుచేసుకుంది. ఇటీవల అక్కడ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై మరో వర్గం మూక దాడికి పాల్పడింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గం.. భారత్‌లో మెజార్టీ వర్గాలకు చెందిన వారు కావటంతో ఇక్కడ నిరసన జ్వాలలు రేగాయి. భారత్‌లోని ఆధ్యాత్మిక, రాజకీయ వేత్తలు ఈ సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేయటంపై ఆ ప్రాంఛైజీ యజమాని షారుక్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించి, మరో ఆటగాడిని ఎంచుకోవాలనే బీసీసీఐ సూచనలతో నైట్‌రైడర్స్ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పిస్తూ.. బీసీసీఐ ఎటువంటి కారణాలను వెల్లడించలేదు. ముస్తాఫిజుర్‌ను తప్పించడాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడమని, ఆ జట్టు మ్యాచ్‌లను భారత్ ఆవల నిర్వహించాలని ఐసీసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఐపీఎల్ ప్రసారాలపై వేటు వేసింది.
ఐపీఎల్‌లో ఆడేది తక్కువే
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై అనధికార నిషేధం కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు తక్కువే. ముస్తాఫిజుర్ రెహమాన్ 2016 నుంచి ఐపీఎల్‌లో ఆడుతుండగా.. షకిబ్ అల్ హసన్ సైతం ఎక్కువ సీజన్లు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్ టైటిల్ నెగ్గిన జట్లలోనూ భాగస్వాములు. అబ్దుర్ రజాక్ (ఆర్‌సీబీ), మహ్మద్ అష్రాఫుల్ (ముంబయి ఇండియన్స్), మష్రాఫె మొర్తాజా (నైట్‌రైడర్స్), తమీమ్ ఇక్బాల్ (పుణె వారియర్స్), లిటన్ దాస్ (నైట్‌రైడర్స్) ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2026 ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక్కడే ఆడాల్సి ఉండగా.. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతడూ ఆడటం లేదు.
ఆర్థికంగా బీసీసీఐకి నష్టమా?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి ప్రధాన ఆదాయ వనరు. ఐదేండ్ల ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ సుమారుగా రూ.48390 కోట్లు ఆర్జించనుంది. ప్రసార హక్కుల ఆదాయంలో 95-97 శాతం వరకు దేశవాళీ టెలివిజన్, డిజిటల్ హక్కుల నుంచే వస్తోంది. బంగ్లాదేశ్ సహా విదేశీ హక్కుల రూపంలో కేవలం 3-5 శాతం మాత్రమే పొందుతుంది. ప్రస్తుత ప్రసార హక్కుల వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ ద్వారా ఐదేండ్లకు రూ.1300 కోట్లు బీసీసీఐ ఆర్జించనుండగా.. ప్రతి ఏడాది రూ.260 కోట్లు పొందుతుంది. ఇది ఓవరాల్‌గా అంతర్జాతీయ మార్కెట్ విలువ. అందులో బంగ్లాదేశ్ మార్కెట్ విలువ చాలా తక్కువ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసార హక్కులను సబ్ లైసెన్స్ ద్వారా టీ స్పోర్ట్స్ దక్కించుకుంది. బంగ్లాదేశ్‌లో వీక్షకులు గణనీయంగా ఉన్నప్పటికీ ఆదాయం ఎంతో తక్కువ. దీంతో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలు నిలిచిపోవటంతో బీసీసీఐకి ఆదాయ పరంగా ఎటువంటి నష్టం వాటిల్లదని చెప్పవచ్చు!.



