పర్యాటకంతో మమేకమయ్యేలా వేడుకలు
సకల జనులతో ఉత్సవాలు : సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : సంప్రదాయం, ఆధునికతల మేళవింపుగా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలతోపాటు హైదరాబాద్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలనీ, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, మన సంస్కృతి, సాంప్రదాయలు ఉట్టిపడేలా, ప్రకతి, పర్యాటకం, పర్యావరణం థీమ్ రూపకల్పన చేయాలన్నారు. వీటిని ప్రతీ ఒక్కరూ కాలర్ ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వధాగా పారబోయకుండా వాటితో పర్యావరణహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న వేడుకలను.. మరోసారి లోకానికి చాటి చెప్పేందుకు సన్నాహాలు చేయాలన్నారు. విస్త్రృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. ఈ నెల 21వ తేదీన వరంగల్‌లోని చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని దిగ్విజయంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతో పాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ సాంప్రదాయ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలని అన్నారు. విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా కళాశాల, యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్లు పండుగ దిగ్విజయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్‌రంజన్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీ డెరెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ షెడ్యూల్
21/09/2025
వేయి స్తంభాల గుడి, వరంగల్ –
బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం)
హైదరాబాద్ శివారులో మొక్కలు నాటడం
(ఉదయం)
22/09/2025
శిల్పరామం, హైదరాబాద్
పిల్లలమర్రి, మహబూబ్‌నగర్
23/09/2025
బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్లగొండ
24/09/2025
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి
సీటీ సెంటర్, కరీంనగర్
25/09/2025
భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం
జోగులాంబ అలంపూర్, గద్వాల
స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ
ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు)
26/09/2025
అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్
ఆదిలాబాద్, మెదక్ నెక్లెస్ రోడ్,
హైదరాబాద్ -సైకిల్ ర్యాలీ
(ఉదయం)
27/09/2025
మహిళల బైక్ ర్యాలీ – నెక్లెస్ రోడ్,
ట్యాంక్‌బండ్, హైదరాబాద్ –
(ఉదయం) ఐటి కారిడార్, హైదరాబాద్ బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)
28/09/2025
ఎల్‌బీ స్టేడియం, హైదరాబాద్ –
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కిపైగా
మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)
29/09/2025
పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ -ఉత్తమ
బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్
(ఎస్‌ఎస్‌జీల తో)హైదరాబాద్, రంగారెడ్డి
ప్రాంతం – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు
30/09/2025
ట్యాంక్‌బండ్ – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, ఇకెబానా – జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3ణ మ్యాప్ లేజర్ షో