అమరజ్యోతి నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ ర్యాలీ
500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకట్టుకున్న లేజర్ ‘త్రీడీ’ షో
పాల్గొన్న మంత్రులు జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకలను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మంగళవారం ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి 700 బతుకమ్మలతో మహిళలు ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ పైకి చేరుకున్నారు. వీరితోపాటు 500మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ చుట్టూ.. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రాండ్ ప్లోరల్ పరేడ్, హుస్సేన్‌సాగర్‌లో తేలియాడే బతుకమ్మలు, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్ లేజర్‌షో బుద్ధవిగ్రహం, సంజీవయ్య పార్క్ వద్ద లేజర్ షోల ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
పండుగ ప్రాముఖ్యతను బీఆర్‌ఎస్ దెబ్బతీసింది : కొండా సురేఖ
బతుకమ్మ పండుగలో వెస్ట్రన్ కల్చర్‌ను జొప్పించి గత సర్కార్ పండుగ ప్రాముఖ్యతను దెబ్బతీసిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేండ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది బతుకమ్మను తామే తెచ్చామని చరిత్రకు వక్ర బాష్యం చెప్పారని విమర్శించారు. తెలంగాణలోని మహిళలు బతుకమ్మ పండుగను.. పండుగలా జరుపుకోవాలని కోరారు. తమ సర్కార్ ఏర్పడ్డ తర్వాత రెండో సారి నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేషన్ చైర్మెన్లు నిర్మలా జగ్గారెడ్డి, వెన్నెల గద్దర్, కాల్వ సుజాత, నేరేళ్ల శారద, అలెక్య పంజాల పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌రంజన్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంగిల పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు….
పెత్తర అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగిసాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికే సొంతం. జీవితమంతా సంతోషంగా సాగిపోవాలనేది పండుగ ఆంతర్యం. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా గుమిగూడి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించి పండుగ ప్రాముఖ్యతను చాటారు.