Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీ బంద్‌ సక్సెస్‌..

బీసీ బంద్‌ సక్సెస్‌..

- Advertisement -

స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రజలు
వామపక్షాలు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ర్యాలీలు
మద్దతిచ్చిన అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం
డిపోలకే పరిమితమైన బస్సులు- రోడ్లన్నీ నిర్మానుష్యం
రిజర్వేషన్ల విషయంలో అసలు విలన్‌ బీజేపీయే
ఆ పార్టీ వైఖరిని ఎండగట్టిన లెఫ్ట్‌ పార్టీలు

‘బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి…’ అనే డిమాండ్‌పై బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం నిర్వ హించిన రాష్ట్ర బంద్‌ జయప్రదమైంది. అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతి పక్షం బీఆర్‌ఎస్‌తోపాటు వామపక్షాలు, టీజేఎస్‌, మేధావులు, ప్రజా సంఘాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాలు, జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు దుకాణాలను మూసేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తున్న బీజేపీ.. కేంద్రంలో మాత్రం వాటిని అడ్డుకుంటోందని సీపీఐ (ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలు దుయ్య బట్టాయి. ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చాయి.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీసీ బంద్‌ సక్సెస్‌ అయ్యింది. అన్ని పార్టీలు దీనిలో భాగస్వామ్యం అయ్యాయి. సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్‌, ఇతర వామపక్షపార్టీలు నారాయణగూడ నుంచి ఆబిడ్స్‌ వరకు ప్రదర్శన నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సచివాలయం చుట్టూ ఉన్న ప్రధాన రోడ్లలో నిరసన ప్రదర్శలు చేపట్టారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఆ పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహం, ఖైరతాబాద్‌ చౌరస్తా, లుంబినీ పార్కు, నెక్లెస్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు జరిగాయి. అధికారికంగా సెలవు దినం కాకపోయిప్పటికీ సచివాలయం సైతం బోసిపోయింది. కొద్ది మంది అధికారులు తప్ప సందర్శకులు, ప్రజలెవ్వరూ అటు వైపునకు రాలేదు.

పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ పక్కనున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బంద్‌ నేపథ్యంలో బీసీ జేఏసీ నేతలు శనివారం తెల్లవారు జామున నాలుగు గంటలకే హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)కు చేరుకుని బైఠాయించారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘బీజేపీ తన మొండి వైఖరిని విడనాడాలి, 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి…’ అని వారు డిమాండ్‌ చేశారు. పలువురు కళాకారులు ఆటపాటలతో ధూంధాం నిర్వహిం చారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో నేతలు బీజేపీ వైఖరిని ఎండగట్టారు. రిజర్వేషన్ల అంశంలో అసలు విలన్‌ ఆ పార్టీనే అని వారు విమర్శించారు. ఈ అంశాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాలని పిలుపు నిచ్చారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవ హారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. కాగా బీసీ రిజర్వేషన్లను కేంద్రంలో అడ్డుకుంటున్న బీజేపీ నేతలు సైతం బంద్‌లో పాల్గొనటం గమనార్హం. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ వద్ద జరిగిన ర్యాలీలో ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. అయితే ఆయన వెంట ఆపార్టీకి చెందిన ఇతర నాయకులు ఎవరూ లేకపోవడం గమనార్హం. మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, విద్యార్థి సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -