Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుబీసీ రిజర్వేషన్లు సాధించాలి

బీసీ రిజర్వేషన్లు సాధించాలి

- Advertisement -

ఐక్య పోరాటాలే శరణ్యం
కాంగ్రెస్‌ ఒంటరి పోరుతో సాధించేదేం లేదు
అసెంబ్లీలో తీర్మానం చేసిన రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది
సామాజిక అన్యాయం, అసమానతలకు ఆ పార్టీనే కారణం
బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను నిలదీయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
పార్టీ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కాంగ్రెస్‌ ఒంటరి పోరుతో సాధ్యం కాదని అన్నారు. కేవలం ఎన్నికల ఎత్తుగడగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోందన్నారు. అవసరమైతే తెలంగాణలో బీజేపీ కేంద్రమం త్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో జాన్‌వెస్లీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతోందని విమర్శించారు. రాష్ట్రపతి సైతం ఆమోదం తెలపడం లేదన్నారు. అసెంబ్లీలో చేసిన తీర్మానంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలని, అంతేకానీ, మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ రిజర్వేషన్లు అడ్డుకుంటామంటే.. మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు అవకాశం కల్పించారన్న సాకుతో రిజర్వేషన్లు అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్నాటక, హర్యానాలోనూ ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్‌ రాజకీయ ప్రయోజనాలకే కాకుండా ఆర్థిక, సామాజిక దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఏకపక్ష పోకడలకు పోకుండా అన్ని రాజకీయ పక్షాలనూ ఏకం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని, ఉపాధి కల్పనా నిలిచిపోయిందని అన్నారు. బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా మహిళల హక్కులు కూడా హరించబడతాయని అన్నారు. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్లు అమలు కోసం క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.సామెల్‌, కాడిగళ్ల భాస్కర్‌, దుబ్బాక రామచందర్‌, డి.జగదీష్‌, ఏర్పుల నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు, ఆయా ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షతన జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదించకుండా పైకి పంపటం సరికాదన్నారు. తెలంగాణలో ముస్లింల కోసమే బీసీ రిజర్వేషన్లు తెచ్చినట్టు బీజేపీ వక్రీకరించి చూపించి బీసీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన ఉండవనీ, ఆయా మతాల్లో ఉన్న వెనకబడిన తరగతుల వారికి ఇచ్చే రిజర్వేషన్లు అని తెలిపారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి పార్లమెంటులో చట్టం చేసేలా చూసి బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య మత ప్రాతిపదికన చీలికలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందడానికే బీజేపీ నాటకాలు ఆడుతోందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మిర్‌దొడ్డి మండల కేంద్రంలో సీఐటీయూ, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ చౌక్‌ వద్ద, పటాన్‌చెరులోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నిరసనలు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద, చిట్యాలలో మహనీయుల సెంటర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కరీంనగర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో, హుజురాబాద్‌లో, పెద్దపల్లిలో బస్టాండ్‌ చౌరస్తాలో, గోదావరిఖనిలో చౌరస్తా వద్ద, సిరిసిల్లలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. అనంతరం ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వనపర్తి పట్టణంలోని రాజీవ్‌ చౌరస్తాలో నిరసన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో, ధరూర్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర నిరసన చేశారు. కల్వకుర్తిలోని మహబూబ్‌నగర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన తెలిపారు. వంగూరులో అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img