Monday, December 1, 2025
E-PAPER
Homeఆటలుగంభీర్, అగార్కర్‌లతో బీసీసీఐ అత్యవసర సమావేశం

గంభీర్, అగార్కర్‌లతో బీసీసీఐ అత్యవసర సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హఠాత్తుగా ఒక ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఈ భేటీ జరగనుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరగనున్న రెండో వన్డేకు ముందు ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌తో రాణిస్తున్నప్పటికీ, జట్టు భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నడుమ ఈ పరిణామం చోటుచేసుకుంది. స్పోర్ట్స్‌స్టార్ కథనం ప్రకారం, ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, గంభీర్, అగార్కర్ పాల్గొననున్నారు. కొత్త బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ హాజరవుతారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. మ్యాచ్ జరిగే రోజు సమావేశం నిర్వహిస్తున్నందున, సీనియర్ ఆటగాళ్లను పిలిచే అవకాశం తక్కువగా ఉంది.

జట్టు ఎంపికలో స్థిరత్వం, దీర్ఘకాలిక ప్రణాళికలు, మొత్తం జట్టు ప్రదర్శనను మెరుగుపరచడం వంటి అంశాలపై స్పష్టత కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలైన నేపథ్యంలో జట్టులోని లోపాలను సరిదిద్దడంపై ప్రధానంగా చర్చించనున్నారు. “స్వదేశీ టెస్టు సీజన్‌లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి. వాటిపై మాకు స్పష్టత కావాలి. భవిష్యత్తు ప్రణాళికలపై కచ్చితమైన అవగాహన ఉండాలి” అని ఆ అధికారి పేర్కొన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -