ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ ఉత్తరయ్య
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రం లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ , తెలంగాణ ఈగల్ సోల్జర్ జి ఉత్తరయ్య హాజరయ్యారై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చిన్నతనం నుండే తమ్మాకు, గుటక, కళ్ళు, సారా, గంజాయి వంటి మాదకద్రవ్యాల వంటి మత్తు పదార్థాలకు బానిసలవకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ వాడకం ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబాలను కూడా దుర్భర పరిస్థితుల్లోకి నెడుతుందని వివరించారు. ఒకసారి అలవాటు పడ్డాక బయటపడటం చాలా కష్టమని, సోషల్ మీడియా, చెడు స్నేహితుల ప్రభావం నుంచి దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి ఉంచి సమయానుకూలంగా సలహాలు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ఎస్.రాములు, విద్యార్థులు తో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.