Sunday, January 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజితినే ముందు….

తినే ముందు….

- Advertisement -

‘వినే ముందు కథ అడగకు, తినే ముందు రుచి అడగకు’ అన్నది సామెత. అసలు కథలో ఒక్కొక్క సీను ఒక క్లైమాక్సులా ఉంటుదని, కథనంలో ట్విస్టులు కేజీలు కేజీలు ఇస్తానన్న సినిమా డైలాగులు వినేముందే, చూసే ముందే కథ అడిగేలా చేస్తాయి. ఇక తినడం మొదలుపెట్టాక అంటే ఒకవేళ ఇస్తరాకులో ఏమన్నా పెడితే, వినడం మొదలుపెట్టక ఏవైనా పనులు చేసినట్టు తీపి మాటలు వినబడితే ప్రజలకు మంచిదే. ఇదీ నిజజీవితంలో ఎదురయ్యే అసలైన పరిస్థితి. ఐతే అది థర్‌ ఎడారిలో కనిపించే ఎండమావేనని మరవకూడదు. వినేముందు, తినేముందు అన్నారేగాని తాగేముందు అనలేదెందుకో అన్న అనుమానం వస్తుంది సహజంగానే. తాగడానికేమేమి దొరుకుతున్నాయి, ప్రజలకు మాంచి రుచిగల మందు, శ్రేష్టమైన కల్తీలేని మందునందిస్తున్నామని నాయకులు చెబుతూనే ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. మన ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుతో మన మందే తాగాలి గాని ఇతర రాష్ట్రాల మందు తాగితే ఏమిటి ప్రయోజనం? మన పన్నులు మనకే రావాలి మన పళ్లు ఊడి మనచేతిలోనే పడాలి అన్నది అసలైన ఫార్ములా. వింటే భారతం వినాలి… అన్నది పాతదైపోయింది.తింటే ఫలానా బ్రాండు విదేశీ చిప్సు తినాలి, వింటే మా పెద్దనాయకుడి అబద్దాల మాటలే వినాలి అన్నది నేటి సామెత.

ఎన్నికల ముందు కూడా ఇలాంటి ”కథ”లే నాయకుల మాటల్లో వింటాము. చెప్పాలంటే రానున్నది గుప్తులనాటి స్వర్ణయుగమని, ప్లాటో సిద్ధాంతం ఉటోపియా గురించి వినే ఉంటారు అది వస్తుందేమోనని, లేదా మహాకవి చెప్పిన మరోప్రపంచం రానున్నదేమోనని జనాలు గాభరా పడిపోతారు. అటు అధికారంలో ఉన్నవాళ్లుగాని, ప్రతిపక్షాలుగాని ఈ మాటలను చెబుతారే తప్ప వినరు. ఎందుకంటే అవి చేతలు కావని అందరికీ తెలుసు, ఒక్క ప్రజలకు తప్ప. ఉటోపియా కొన్ని సద్గుణాలపై ఆధారపడి ఉంటుంది. న్యాయం, జ్ఞానం, మితతత్వం, ధైర్యం ఇలా కొన్ని మాంచి గుణాలు పాలకులకు అదీ తత్వవేత్తలైన పాలకులు, పౌరులు ఈ గుణాలను కలిగి ఉండాలి. ఆమధ్య ఒక అయ్యేయస్సు ఆఫీసరు కూడా ఇలాంటివే చెప్పి తరువాత బోల్తా పడ్డాడు అది వేరే విషయం అని చెప్పను, అది ఈ విషయమే.

ఎన్నికల తరువాత ప్రజలకు కేజీలు, కేజీలు, టన్నులు టన్నులుగా లభించేది అధికధరలు, పన్నులు. పన్ను ఊడితే పన్ను, పన్ను కట్టుకుంటే పన్ను, కంటి మీద పన్ను, కంటిచూపు మీద పన్ను. అన్నీ పండ్లూడేవే కాని ఇతరత్రా అతికించేది, బతికించేది ఏదీ ఉండదు. ఒకవేళ పొరబాటున మంచి జరిగితే అది తమవల్లే, అదే ఏదన్నా ప్రజలకు చెడు జరిగితే అది ప్రతిపక్షాలవల్ల, లేదా ఇంతకు ముందు పాలించిన పార్టీ పైన ఉంటాయి విసుర్లు. రాష్ట్రాల్లో మాట్లాడినట్టు కేంద్రంలో కూడా అలవాటుగా పోయిన పాలకులు, ఐదేళ్లు పాలించినవాళు అని ఒకసారన్నా తిడతారేమోనని చూసినా చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి వాళ్ల మాటలు. వాళ్లు మాట్లాడితే హిందీ శబ్దాలో లేక సంస్కృత సమాసాలో ఉంటాయిగాని మామూలు జనాలకు అర్థమయ్యేది, అర్థం చేసుకోవలసిందీ ఉండదు. ఫలానా స్వాస్థ్‌ యోజన లేదా ఇంకో జన సమర్థ్‌ యోజన అంటూ ఉంటాయి సదరు పేర్లు. ప్రజలకు మాత్రం నిత్యం అస్తవ్యస్త యోజనలే ఎదురవుతూ ఉంటాయి. అన్నీ ప్రయోజన రహిత యోజనలే కళ్లముందు.

కొందరు నాయకులు అధికారంలోకొస్తే ఆ దేశానికే కాక ప్రపంచానికి మొత్తం ముంచుకొచ్చే ప్రమాదముంది. తమ పార్లమెంటుమీదే దాడిచేసి అధికారంలోకొచ్చిన ట్రంపులవారు ఇందుకు ఉదాహరణ. మొదట దేశాన్ని బాగుపరుస్తానని కొన్ని మార్పులు చెప్పాడు. తరువాత ఇతర దేశాలవల్లే మనం ఇలా ఉన్నామని వాళ్లపై పన్నులు వేశాడు. ఇప్పుడు ఇతరదేశాలపై దాడులు కూడా చేస్తున్నాడు. యుద్ధాలాపుతానని చెప్పి తానే యుద్ధాలు చేస్తున్నాడు. అందుకేనేమో కొందరు ఈయనకి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పింది. అలా ఇస్తేనన్నా కాస్త శాంతిగా ఉంటాడన్న ఆశ ఉన్నట్టుంది వాళ్లకు. ‘ఫలానా వ్యక్తి నాకు మంచి మిత్రుడే, అతనితో జోడీ నాకు ఇష్టమే, ఐతే వచ్చిందల్లా ఇంకొకరితే జోడీ నాకు నచ్చదు అన్నది’ ట్రంపులవారి యోజన. దాన్ని ఆంగ్లంలో ఏమంటారో కృత్రిమ మేధనడిగి చెప్పాలి.

అంతా కృత్రిమంగా కనిపించే ఈ వ్యాపార ప్రపంచంలో కృత్రిమ మేధ ఉండడం సరైనదే. ఎందుకంటే అందులోనన్నా కాస్త తీపి కబుర్లు ఉంటాయి వినడానికి. అవతలివాడు తినే కంచంలోనుండి లాక్కునే బకాసురులు అనేకమంది ఉంటారు. వాళ్లే అన్నిదేశాలపైన ఐదువందల శాతం పన్ను వేస్తామంటారు. ఇంకొన్ని రోజులుపోతే వెయ్యిశాతం అనొచ్చు. నాదగ్గర కొనేవాటిపైన పన్నుకట్టండి, నాకు అమ్మేవాటిపైన సుంకాలు వేస్తాము అని అవతలివాడిని దెబ్బతీస్తారు. తినడం, వినడం అటుంచి కూచుంటే ఫలానా సింహాసనంలోనే కూచోవాలి అని నిర్ణయించుకొని ఉంటారు. తాము కూచున్న కుర్చీని కాపాడుకునే క్రమంలో ఈ పన్నులు పెంచడమన్నది తమను దించడానికేనన్న కొత్త కథలు చెబుతున్నారు. వినేవారుంటే చెప్పేవాళ్లూ ఉంటారు. కొత్త సంవత్సరంలోనైనా వాస్తవాలను చూడండని వాళ్లకు మనవి.

రఘుబాబు జంధ్యాల
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -