Tuesday, July 29, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'పరాయి' ముద్రతో వేట, వేధింపుల వెనుక...

‘పరాయి’ ముద్రతో వేట, వేధింపుల వెనుక…

- Advertisement -

గత కొంత కాలంగా దేశమంతటా భయాందోళనలు తాండవిస్తున్నాయి. భారీ సంఖ్యలో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను బంగ్లా దేశీయులుగా ముద్ర వేయడం ఇందుకు కారణమవుతున్నది. బెంగాలీ మాట్లాడ్డం, ముస్లింలై వుండటం కలగలిపి ఒక ప్రమాదకరమైన లేబుల్‌ తగిలిస్తున్నారు. వారిని ఉన్నఫళానా అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులుగా ముద్ర వేస్తున్నారు.
ఇది నిజంగానే ఒక తప్పుడు చిత్రణ. పౌరసత్వ సవరణ చట్టం రూపకల్పన వెనుక వున్నది ఇలాంటి తప్పుడు భావనే. ఈ ప్రచార కాండలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముందు పీఠిన నిలిచారు. అస్సాం ప్రజలు సి.ఎ.ఎ పట్ల ఎలా స్పందించారో ఆయనకు తప్పక తెలిసి వుంటుంది. ఈ తరహా ప్రచారం సాగించే సందర్భంలో ఆయన ఈ అంశాన్ని అంతర్గర్భితంగా ప్రస్తావిస్తున్నారు. బెంగాలీ మాట్లాడే వారెవరైనా బంగ్లా దేశీయులను గుర్తించడానికి సహాయ పడతారని చెప్పేదాకా వెళ్లారు. అలా చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే ఈ రెండింటి మధ్యనా విడదీయరాని ముడివుందని సంకేతమివ్వడమే. రాజ్యాంగ విరుద్ధమైన ఈ వ్యాఖ్యపై తీవ్రాగ్రహం వ్యక్తం కావడంతో హిమంత ఒక విధంగా తప్పు ఒప్పుకోవలసి వచ్చింది: ”సరే, వారంతా విదేశీయులే కానక్కరలేదని ఒప్పుకుందాం, అయితే అస్సామీలమైన మనం ప్రత్యేకించి హిందువులం మన గడ్డ మీద దిక్కులేని మైనారిటీలుగా అయిపోతున్నాం. కేవలం అరవై ఏళ్ల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. మన సంస్కృతినీ, భూమినీ, దేవాలయాలను పోగొట్టుకున్నాం. చట్టం మనకు సహాయ పడిందేమీ లేదు. అందుకే మనం నిస్పృహతో వున్నాం. అది మనుగడ కోసమే తప్ప ప్రతీకారానికి కాదు.”
భూముల పరాధీనం
అయితే ఈ నిస్పృహ వచనాలలో పిసరంతైనా పశ్చాత్తాపం లేదు. బెంగాలీ మాట్లాడే వలస కార్మికులందరూ బంగ్లా దేశీయులేనన్న అంచనాతో వారికి వ్యతిరేకంగా మాట్లాడ్డం బూటకమే. సరిహద్దుల ఆవలికి ఈ నిస్సహాయ ప్రజానీకాన్ని నెట్టివేసేందుకోసం అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ అందుకు అవసరమైన ఆధార పత్రాలు చూపించడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూ వస్తున్నాయి. ఈ ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశమేమిటో కూడా అంతకంతకూ స్పష్టమవుతున్నది. వారిని వారి భూముల నుండి వెళ్లగొట్టాలి. తరచూ ఇందుకోసం బుల్డోజర్లు వినియోగించడం జరుగుతుంది. అలా తీసుకున్న భూములను కార్పొరేట్‌ భూ కబ్జాదార్లకు అప్పగించడమే జరుగుతుంది. ఉత్తరోత్తరా అదో భూ సంబంధమైన అవినీతి వ్యవహారాలకు దారితీస్తుంది. అంతేగాక ఈ ప్రచారం వల్ల రాష్ట్రంలోని బహు జాతులతో కూడిన వైవిధ్యభరిత ప్రజానీకంలో విభజన మరింత తీవ్రమవుతుంది. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో. అంతిమంగా ఈ వివాదాలు రాష్ట్ర ప్రభుత్వ విస్త్రుత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దోహదం చేస్తాయి.
చారిత్రిక వాస్తవాలేంటి?
1971 తర్వాత బంగ్లాదేశ్‌ నుంచి అస్సాంలోకి వలసలు కొనసాగిన మాట కాదనలేనిదే కానీ అక్రమ వలసదారులు మిడతల దండులా వచ్చి రాష్ట్రాన్ని ఆక్రమించేస్తున్నారనే భయాందోళనలు మాత్రం బూటకమైనవి. వాస్తవ విరుద్ధం. అఖిల భారత స్థాయిలో జనాభా పెరుగుదలకు భిన్నంగా అస్సాంలో గత కొన్ని సంవత్సరాల్లో జనాభా పెరుగుదల తగ్గుముఖంలో వుంది. అక్రమ వలసదారులు ముంచెత్తు తున్నారనే పాట మాత్రం ముదిరిపోయినట్టు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా పెరిగిపోతున్నదనే భయాందోళన సఅష్టించడమే ఇందుకు చాలావరకూ కారణం.జనాభా విషయాల అధ్యయనాలు కూడా వలసవాద పాలనలో తిరుగులేని విధంగా అస్సాం జనాభా పొందిక మారిందని నిర్ధారణగా చెప్పాయి. తూర్పు బెంగాల్‌ నుంచి నిరంతరాయంగా వలసలు జరగడమే ఇందుకు కారణమైంది. 1901-1941 మధ్య ఒక క్రమ పద్ధతిలో వలస ప్రభుత్వం ఈ వలసలను ప్రోత్సహించడం వల్ల ఈ ప్రాంతంలో జనాభా పొందిక స్వరూపం మారిపోయింది. ఎన్నికల సంఘం నొక్కి చెబుతున్న మాటలు నమ్మేట్టయితే ఒక ప్రశ్న సహజంగానే వచ్చేస్తుంది. దేశ విభజనకు ముందు అస్సాంలో స్థిరపడిన లక్షలాది మంది తూర్పు బెంగాల్‌ ముస్లిం వలస రైతుల వారసులు ఎక్కడ స్థిరపడ్డారు?
ఫేక్‌ కథలు, ఘోర జ్ఞాపకాలు
కనుక హిమంత అదేపనిగా చేస్తున్న నిర్ధారణలు జాతి పరమైన, మత పరమైన కథనాలకు అనుగుణంగానే సాగుతున్నాయి. కానీ జనాభా వివరాలు భిన్నమైన సత్యాలు చెబుతున్నాయి: 1991-2001కీ 2001-2011కీ మధ్య దశాబ్దాలలో బంగ్లాదేశీ వలసదార్ల సంఖ్య 2.79 లక్షల నుంచి 1.72 లక్షలకు తగ్గిపోయింది. అంటే దాదాపు సగానికి సగం పడిపోయిందన్న మాట. అయితే ఈ ఫేక్‌ న్యూస్‌, వైరల్‌ వాట్సప్‌ ఫార్వర్డ్‌ల కాలంలో నిజమైన లెక్కలు ఎవరికి కావాలి?ఈ ధోరణి కేవలం అస్సాంకే పరిమితం కాదు. దేశంలోని విస్తార ప్రాంతాల్లో ప్రత్యేకించి బీజేపీ పాలించే రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లింలందరూ బంగ్లాదేశ్‌ అక్రమ వసలదారులనే ప్రచారం భారీగా సాగుతున్నది. అధికార పత్రాలను ఏ మాత్రం పరీక్షించకుండానే ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. అనేకసార్లు హింస పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల సంఖ్య సుమారు 2.47 కోట్లు వుంటుంది. మొత్తం 9.13 కోట్ల రాష్ట్ర జనాభాలో ఇది 27.01 శాతం, ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న ప్రస్తుత నేపథ్యంలో వారిలో అనేకులు పనికోసం రాష్ట్ర సరిహద్దులు దాటి బయిటకు పోవడం సహజమే. ఆ విధంగా రాష్ట్రాంతర వలసలో చెప్పుకోదగిన భాగంగా వుండొచ్చు. పౌరసత్వాన్ని నిర్ధారించే ఏకాంశ అధికార పత్రంతో కాకుండా, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఎపిక్‌ వంటి వాటన్నిటినీ తోసిపారేసేట్టయితే ఈ శ్రామికులు ఎంత దారుణంగా దెబ్బ తింటారనేది ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వారు ఎంత ప్రమాదకర పరిస్థితిలో వున్నదీ కోవిడ్‌-19 తరుణంలోనే నగంగా వెల్లడైంది. వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచిపోవడం. ఒక తల్లి బిడ్డను సూట్‌కేస్‌ మీద కూర్చోబెట్టి చక్రాలతో తోసుకుంటూ పోవడం, నడిచే రైలు కిందపడి చితికిపోయి చెల్లాచెదురైన వలస కార్మికుల దేహ ఖండాలు ఇంకా మనందరి మస్తిష్కంలో వెంటాడుతూనే వున్నాయి.
వ్యవస్థ లక్షణమే
ప్రపంచీకృత పెట్టుబడిదారీ వ్యవస్థలో వలస కార్మికులనేవారు ఒక అవిభాజ్య భాగంగా వుంటారనేది తెలియడానికి ఎవరూ చరిత్ర లోతుల్లోకి పోవలసిన అవసరం లేదు. పెట్టుబడిదారీ విధానం వలసలు, అర్థ వలసల నుంచి ఆర్థికంగా బలహీనంగా వున్న ప్రాంతాల నుంచి తెచ్చిన శ్రామికులపైనే ఆధారపడి పెరిగింది. 19వ శతాబ్ది ద్వితీయార్థంలో టీ, కాఫీ, చెరకు, రబ్బరు తోటలు పెరిగాయి. రైల్వేలు, టెలిగ్రాఫ్‌ లైన్లు, నవీన గనుల తవ్వకాల ప్రారంభం వంటివన్నీ పెద్ద ఎత్తున జరిగింది అలాగే. శ్రామిక బలగాల చలనశీలత అటూ ఇటూ తరలిపోవడం కూడా అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో సాగింది. ఉత్తరోత్తరా రాజ్యాలు వలసల క్రమబద్ధీకరణ, నిర్వహణకు వ్యవస్థలను పెంపొందించాయి. ఆ అంశానికున్న రాజకీయ ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించాయి.21వ శతాబ్దంలో ద్రవ్య పెట్టుబడితో నడిచే ప్రపంచీకరణ, ఘర్షణల కారణంగా కలిగే నిర్వాసం, దేశాంతర శ్రామిక ప్రవాహాలతో వలసలు సరికొత్త తక్షణాంశాలుగా తయారైనాయి. అయినా సరే దాంతోపాటే అభివృద్ధి నిరోధక మితవాద భావజాలాలు కూడా పెరిగిపోయాయి. అస్తిత్వ ఆధారిత సమీకరణలను సఅష్టించడానికి ఇది వారికి వాటమైన ఆయుధంగా తయారైంది.
ట్రంప్‌ టు ఆరెస్సెస్‌
”ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వలస కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022లో మొత్తం ప్రపంచ శ్రామిక బలగంలో వీరు 4.7 శాతంగా వున్నారు. వారిలో అత్యధికులు అధికాదాయ దేశాలలో సర్వీసు రంగం వంటి వాటిలో ఉద్యోగాలలో వుంటున్నారు. వాటిలో తగు సదుపాయాలు కల్పించేవే” అని 2024 అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నివేదిక నొక్కి చెబుతున్నప్పటికీ ఈ ఆర్థిక వాస్తవాలను తోసిపుచ్చే రాజకీయ తొక్కిసలాట మనం చూస్తున్నాం. ‘పక్కన పెట్టడం, పరాయివాళ్లను చేయడం’ అనే ఈ దుందుడుకు ధోరణికి డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు ప్రతిరూపాలుగా వున్నాయి. వలసలనూ వలస కార్మికులను నేరస్తులుగా చూపే ఈ ధోరణిని మనం సుస్పష్టంగా తిరస్కరించాలి.
ఈ అంతర్జాతీయ పరిణామాల మధ్య భారతదేశాన్ని విడదీసి చూడలేము. బలీయమైన కార్పొరేట్‌ మతతత్వ కూటమికి ఆరెస్సెస్‌్‌ హిందూత్వ భావజాలం కేంద్రంగా వున్న పరిస్థితిలో బెంగాలీ మాట్లాడే శ్రామిక ప్రజలపై దాడులు జరిగి తీరతాయి. ప్రస్త్తుతమున్న ఈ ప్రభుత్వం జాతి, భాష, సాంస్కృతిక వైవిధ్యాలకు వ్యతిరేకమైంది. మనందరం కలసి కట్టుగా సాగించిన సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్య్ర పోరాట క్రమంలో రూపొందిన భారత దేశ భావన గుండెకాయ పైనే ఆ విధంగా అది వేటు వేస్తుంది.హక్కులనూ మానవత్వాన్ని దెబ్బ తీసే ఈ దాడిపై ఏ ఒక్క తరగతికి చెందిన ప్రజలు మాత్రమే ప్రతిఘటించడం సాధ్యమయ్యేది కాదు. మనం అంటే ప్రజలమైన మనం ఏకతాటిపై నిలిచి పోరాడాలి.
(జులై 21-27 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -