నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండలంలో 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. మండల విద్యాశాఖాధికారి నరేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అపారమని, విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో వారి కృషి అమూల్యమని అన్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ నరేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారే కాకుండా సమాజానికి దారి చూపించే దీపస్తంభాలుగా నిలుస్తారని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే ప్రధాన భూమిక వహిస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చూపిన నిబద్ధత, కృషి వలననే మండలంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.