గత వారం మానవిలో ఒత్తిడి నుండి ఎలా సంరక్షించుకోవాలన్నది కొంత వరకు తెలుసుకున్నాం. అదే నేపథ్యంలో ఈ వారం.. సమస్య ఉంది, కానీ దాని పరిష్కారం ఏ మాత్రం మన చేతుల్లో లేదని తెలుసుకున్న తర్వాత కూడా వదలని దీర్ఘకాలిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఈ రకమైన ఒత్తిడి ప్రమాదకరమైనదే కాకుండా, కుటుంబాన్ని, చుట్టూ ఉన్న ఆత్మీయుల్ని కూడా కబళించివేస్తుంది. దీర్ఘకాలిక తీవ్ర ఒత్తిడిని కలిగించే పరిస్థితులు చాలా వరకు మనందరికీ సుపరిచితమే. పెద్దవాళ్ళకు సంబంధించి, హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటుందనుకొన్న కూతురు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవటమో, కొడుకు పెండ్లి చేసుకొని వేరేగా ఉంటూ చూడడానికి రాకపోవడమో లేదా విదేశాలకు వెళ్ళిపోయి, కనీసం ఫోన్ కూడా చేయకపోవడమో వంటివైతే.. పెండ్లయిన వెంటనే విడాకులో, గృహవేధింపులో, టార్గెట్స్ చేయి దాటిపోయి, రిలేషన్షిప్స్ దెబ్బతిని, చేయిజారిపోయిన అవకాశాల జ్ఞాపకాలు వదలక, ఎవరి ఆపేక్షలు, అంచనాలు తీర్చని నిస్సహాయత, పిల్లల్లో చదువు వత్తిడి.. ఇలా ఎన్నెన్నో మానసిక ఒత్తుడులు యువతలో అనేకుల్ని నిర్విరామంగా పీడిస్తుం టాయి.
తట్టుకోలేని సంఘటనలు
మానసికంగా బయటపడలేని ఒక విషవలయంలో చిక్కుకున్న భావనలో మహిళలు నిస్సహాయంగా ఇరుక్కుపోయి ఉంటారు. ఇటువంటప్పుడు ఇంటి వాతావరణంలో సానుకూలతను పెంచి, కుటుంబ సభ్యులు ఎదుర్కుంటున్న మానసిక, తద్వారా జనితమయ్యే శారీరిక ఒత్తుళ్ళకు కొంతవరకు ఓదార్పునివ్వగలిగేది ఇంటిలోని స్త్రీమూర్తులే. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త, అక్క, చెల్లి, భార్య, కూతురు, స్నేహితురాలు తదితరులు. స్త్రీలలో ఉత్పన్నమయ్యే కొన్ని రకాల హార్మోన్ల కారణంగా ప్రకృతిసిద్ధంగానే వారిలో అనురాగం, ఓర్పు, సానుభూతి ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. దాని వల్ల వారు కొంతవరకు ఎటువంటి ఒత్తిడినుండైనా తొందరగా కోలుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు. కానీ వారూ తట్టుకోలేని సంఘటనలు కూడా కోకొల్లలు. ఆ సందర్భాలలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురౌతూ, బాధను ఎవరితోనూ పంచుకోలేక, వ్యధకు మందు దొరకక లేదా సమస్యకు పరిష్కారం కనిపించక, ఆ క్షోభను తట్టుకోలేక, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులౌతారు. కుటుంబసభ్యులకు కూడా వారిని పట్టించుకొనే పరిస్థితిలో లేకపోవచ్చు.
అటువంటప్పుడు ఏమి చేయాలి?
స్త్రీలు ఇలాంటప్పుడే తమకు ప్రకృతి సిద్ధంగా లభించిన హార్మోన్ల శక్తిని గుర్తుచేసుకోవాలి. స్వీయ సహాయానికి నడుం బిగించాలి. అంతకు మించిన సహాయం వేరొకటి లేదన్న విషయం గ్రహించాలి. ఎవరి సమస్యలకు పరిష్కారం వారే అన్వేషించుకోవాలి. ఆ క్రమంలో అతి శక్తివంతమైన ప్రక్రియ.. స్వీయ ఓదార్పుకు పూనుకోవటం. మనం మామూలుగా ఇది చేస్తూనే ఉంటాము. ‘నాకు నేను నచ్చచెప్పుకున్నాను’ అని అంటుంటాము కదా! ఒత్తిడి తీవ్ర రూపం దాల్చిందంటే నచ్చచెప్పుకునే దశలో లేమని అర్థం. ‘నేను ప్రయత్నం చేశాను. వీలవటంలేదు’, ‘అదెలా సాధ్యం’ ఇలా ఎన్నోరకాల భావనలు ఉత్పన్నమవచ్చు. చెప్పడం చాలా సులువు అనిపించవచ్చు. ఇది కష్టమే కానీ అసంభవం మాత్రం కాదు. మనిషి మానసిక ప్రవృత్తి పరంగా స్వీయ ఓదార్పుకు కావల్సిన మహత్తర ఆయుధం నిర్మోహము. దీన్ని ఆంగ్లంలో డిటాచ్మెంట్ అంటారు.
నిర్మోహము అంటే ఏమిటి?
రాగద్వేష రహితులైన వారు అన్ని విషయాలలో పాల్గొంటూనే శాంతచిత్తులై ఉండగలుగుతారని పుస్తకాల్లో చదివి ఉన్నాము కదా! సాధారణంగా నిర్మోహము అంటే నిర్లిప్తత, అనాసక్తి, అజాగురూకత ఇలాంటి నాకారాత్మక స్థితులుగా అపార్థం చేసుకొనే అవకాశమున్నది. ఇది మన జీవితాల్లో సంతులత, సామరస్యం, హుందాతనం నింపుకోవటానికి అత్యంత ఆవశ్యకత ఉన్న ఒక నైపుణ్యత. జీవితంలో అంతా సరిగా ఉన్నప్పుడు ఈ పదానికి ఏ మాత్రం విలువనివ్వకపోవడమే కాకుండా దీని ప్రస్తావనే హాస్యాస్పదమౌతుంది. కానీ పైన ప్రస్తావించిన దు:ఖమయ పరిస్థితులను ఎదుర్కోవడానికి, వాటి విషజ్వాలల నుండి బయటపడటానికి దీనికి మించిన ఆయుధం లేదనే చెప్పాలి.
సాధన ద్వారానే…
ఈ ఆయుధాన్ని వశపర్చుకోవడానికి ముందుగా దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దాని అవసరం ఎప్పుడు కలుగుతుందో తెలియదు. నిర్మోహస్థితిని చేరడానికి త్వరిత మార్గాలేవి లేవు. సాధన ద్వారా మాత్రమే లభ్యమౌతుంది. అది అందుబాటులో ఉండడానికి శరీర పుష్టి కోసం రోజూ వ్యాయామం చేసినట్టే ఆ నైపుణ్యాన్నీ సాన పట్టాలి. సాధన చేయడమంటే మొట్ట మొదలుగా దాని పట్ల అవగాహన కలిగి ఉండడం. అతిప్రియమైనదాన్ని పోగొట్టుకొని, ఒకానొక తీవ్ర ఒత్తిడికి గురౌతున్న దశలో, మీ ఆవేదనాగ్నిని సంపూర్ణంగా బయటకు రోదన రూపంలో స్రవించనివ్వడం నిర్మోహస్థితి మొదటి మెట్టు. సంతోషం వచ్చినప్పుడు ఎలా నవ్వుతామో దు:ఖంలో కూడా అలాగే ఏడవాలి. కానీ అది ఇతరుల సమక్షంలో కాకుండా, ఏ విధంగా చేస్తే మనపై మనకు ఏకాగ్రత కుదురుతుందో ఆ పద్దతిలో చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పైన చెప్పినట్టు చేయడం వలన భావొద్వేగం తగ్గి మెదడు నుండి తార్కికం (రీసనింగ్) మొదలౌతుంది.
శాస్త్రీయ పద్ధతిలో…
ఒకసారి ఆవేదనంతా బయటికి జొప్పించి, భావొద్వేగం అదుపులోకి వచ్చిన తర్వాత భావాలను, గతించిన విషాదాన్ని, స్వీయ అన్వేషణ ద్వారా దృశ్యమానం చేయాలి. తార్కికాన్ని అమలులో పెట్టి, జరిగినదంతా శాస్త్రీయ పద్ధతిలో, నిశితంగా స్వీయ విచారణ చేయాలి. ఆ తరుణంలో అందులో తన పాత్ర, నిస్సహాయత, భయాలు, మొహమాటాలు, తటపటాయింపులు అన్ని వెలువడి తనను తాను అపరాధ /బాధిత క్రమం నుండి బయటకు తెచ్చుకోగలుగుతారు. ఆ క్రమంలో, ఆ విధమైన ఒత్తిడి కొనసాగితే తనకు వాటిల్లే నష్టాలూ అవగతమౌతాయి. అప్పుడే లాభాన్వేషణ ఆరంభమౌతుంది. ఆ సంఘర్షణలో తాను పొందిన లబ్ధిని కూడా, అది ఎలాంటిదైనా అయిండవచ్చు. జీవితానుభవమో, పాఠమో, దాని పట్ల అంగీకార భావం ఉత్పన్నమవడం మొదలౌతుంది.
మనల్ని ప్రేరేపిస్తుంది
ఫలితంగా కొత్తగా మళ్ళీ మొదలుపెడదామనే ఉత్సాహం నెమ్మదిగా పుంజుకుంటుంది. ఆ ఉత్సా హనికి ప్రోత్సాహమిచ్చుకోవాలి. అప్పుడు మనకు తెలియని శక్తి మనల్ని ముందుకు నెడుతుంది. అదే శక్తి మనల్ని ప్రేరేపించి తిరిగిరాని అవకాశాల గురించి మర్చిపోయేలా చేసి, విజయం వైపు ఉరకలు వేయిస్తుంది. ఇది ఒక నిరంతర మాన సిక శిక్షణా ప్రక్రియ, నిష్ఠతో, క్రమబద్ధంగా, ప్రతి క్షణం ఈ ప్రక్రియ పట్ల అవగా హనతో, జాగురూకతతో ఆచరించి నట్లయితే తప్పక త్వరిత ఫలితాలు కనిపి స్తాయి. ఈ రకమైన సకారాత్మక, నిరంతర, నిర్మోహ వైఖరితో కూడుకున్న స్వీయ ఓదార్పే, స్త్రీని, ఆమె ఎదుర్కునే ఒడిదుడుకుల్ని, ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యభరిత జీవన శైలి వైపు అడుగులు వేసేటట్టు చేస్తుంది.
– డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్
స్వీయ ఓదార్పుతో మెరుగైన ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -