- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా. వెంటవెంటనే ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు.
భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు. ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు.
కాగా, హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన, పశు సంపద కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలుపాలని అన్నారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఏకమొత్తంలో 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. ఈ పథకం కింద వచ్చే దరఖాస్తులను విచారణ చేసి త్వరితగతిన ఆర్డీవో లకు పంపించాలని తహసీల్దార్లకు సూచించారు.
కాగా, గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన వారు నియామక పత్రాల కోసం ప్రత్యేక బస్సులలో సకాలంలో హైదరాబాద్ చేరుకునేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.