నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అన్యూహ్య పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం మార్నింగ్ వాక్ చేశారు. కొన్ని గంటల గ్యాప్‌లోనే ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ తన దినచర్యలో భాగంగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో పన్నీర్ సెల్వం కలిశారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఈ విషయాన్ని పెన్నీర్ సెల్వం విశ్వాసపాత్రుడు పన్రుతి ఎస్. రామచంద్రన్ తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తును ముగించుకుంటున్నట్లు వెల్లడించారు. ఓపీఎస్ త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తారని.. ప్రస్తుతం ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. భవిష్యత్తులో ఎన్నికలకు మందు పొత్తుపై ఆలోచిస్తామన్నారు.