Wednesday, January 7, 2026
E-PAPER
Homeమానవిబైక్‌ రైడర్ అర్చన

బైక్‌ రైడర్ అర్చన

- Advertisement -

అర్చన చిగుళ్లపల్లి… సరదాగా నేర్చుకున్న బైక్‌ రైడింగ్‌ ఈ రోజున తనకు ఉపాధి కల్పిస్తుందని ఆమె ఊహించలేదు. ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమెను బైక్‌ రైడింగ్‌ ఎంతగానో ఆకర్షించింది. అందుకే తండ్రి దగ్గర చిన్నతనంలో నేర్చుకున్న బైక్‌ రైడింగ్‌ ‘షీ రైడ్స్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించేలా చేసింది. సాహసాలు చేయాలనుకున్నప్పుడు తగిన శిక్షణ చాలా అవసరం. అందుకే తన సంస్థ ద్వారా గత తొమ్మిదేండ్లుగా సాహసాలు చేయాలని కలలు కంటున్న మహిళలు తమ కలలను నిజం చేసుకునేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికి కొన్ని వేలమందిని బైక్‌ రైడర్స్‌గా తీర్చిదిద్దుతూ మహిళలకు ఆదర్శనంగా నిలుస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

అర్చన తల్లిదండ్రులు నరేష్‌, జమున. వీరి సొంత ఊరు బెంగుళూరు. తండ్రి వ్యాపారం చేసేవారు. వీరి తొలి సంతానం అర్చన. డబుల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. విద్యాభ్యాసం అనంతరం ఎయిర్‌ హోస్టెర్‌గా ఉద్యోగం చేశారు. అర్చన ఆరవ తరగతిలో ఉండగా తండ్రి దగ్గర సరదాగా చేతక్‌ నడపటం నేర్చుకున్నారు. ఆమె చేతక్‌ నడపటం చూసి స్నేహితురాళ్లు, చుట్టుపక్కల వాళ్ళు తమకి కూడా నేర్పమంటూ అడిగేవారు. అది ఒక ప్రవృత్తిగా భావించి తండ్రి తనకు బండి నడపటం ఎలాగైతే నేర్పారో తాను కూడా అలాగే వారికి నేర్పించడం మొదలుపెట్టారు.

స్నేహితుల సలహాతో…
పెండ్లి తర్వాత అర్చన కొన్ని స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వారితో కలిసి పని చేస్తున్నప్పుడు ఎవరికైనా బండి నడపటం నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఉచితంగా నేర్పిస్తాను అనేవారు. ఇది చూసి స్నేహితులు ‘ఉచితంగా నేర్పిస్తే విలువ ఉండదు, నువ్వు నేర్పిస్తున్నది ఒక కళ. దాని విలువ పెరగాలంటే ఎంతో కొంత ఫీజు ఉంటే బాగుంటుంది, అది తక్కువైనా పర్లేదు’ అని సలహా ఇచ్చారు. దాంతో తక్కువ ఫీజు తీసుకొని బండి నేర్పడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల మందికి ఆమె బైక్‌ నడపడం నేర్పించారు. ఆమె దగ్గరకు 18 ఏండ్లు పైబడిన వారి నుండి 70 ఏండ్లు ఉన్న వృద్దుల వరకు బైక్‌ రైడింగ్‌ నేర్చుకోవడానికి వస్తారు. ఇందులో తొంభై శాతం పైగా మహిళలే వస్తారు. ఇందులో ప్రముఖులు, వారి పిల్లలు కూడా ఉన్నారు.

ఆత్మ విశ్వాసం ఉంటే చాలు…
ఒక కోర్స్‌ నేర్చుకోవడానికి వారం, పది, నెల రోజులు పడుతుంది. అయితే అర్చన మాత్రం ఎక్కువగా వారం రోజులు నేర్చుకుంటే చాలు అంటారు. కానీ చాలా మంది ‘వారం రోజుల్లో వస్తుందా’ అని సందేహ పడుతుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆత్మ విశ్వాసం, ధైర్యం ఉంటే వారం రోజుల్లో బైక్‌ నేర్చుకోవచ్చు’ అంటారు అర్చన. దగ్గరుండి వాళ్లు అన్నీ నేర్చుకునెలా శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు గతుకుల రోడ్డు మీద తీసుకోవలసిన జాగ్రత్తలు, వర్షంలో నడపవలసి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సిగల్స్‌ ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మొదలైనవన్నీ నేర్పిస్తారు. ద్విచక్ర వాహనం మాత్రమే కాకుండా, కారు నడపటంలోనూ ఆమె శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా మహిళలు ఆమె దగ్గర శిక్షణ తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

అమ్మాయిలకు అవగాహన
ఒక ప్రదేశానికి వెళ్లి బైక్‌ రైడింగ్‌ నేర్చుకోవాలంటే కనీసం ఐదు నుండి పది మంది వరకు ఉండాలి. వారు ఒక్కరికే ప్రత్యేక సమయం తీసుకొని నేర్పించాలంటే కొత్తపేటకు వెళ్లి నేర్చుకోవాలి. అర్చన స్వచ్చంధ సంస్థలతో కలిసి పనిచేస్తుండటం వల్ల వారు వివిధ రాష్ట్రాలలోని, మారుమూల ప్రాంతాలలోని యుక్త వయసు పిల్లలను, మహిళలను ఒక చోట చేర్చే వారు. ఆ ప్రాంతానికి వీరు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం పట్ల అవగాహన కల్పించేవారు. భవిష్యత్తులో తన సంస్థను ఇతర రాష్ట్రాలలో కూడా ప్రారంభించాలని అర్చన అనుకుంటున్నారు. దీనిద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఉన్నారు.

సమస్యలకు భయపడొద్దు
‘జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సమస్యలను చూసి భయపడితే జీవితం ముందుకు సాగదు. రోజూ ప్రతి విద్యార్థి దగ్గరనుండి ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాను. కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అటువంటప్పుడు మనసు ఎంతో కలత చెందుతుంది. మహిళ అంటే ఎందుకు అంత చులకన భావం. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించడం, ప్రోత్సహించడం నేర్చుకున్న నాడు సమాజంలో మహిళ స్థానం ఎంతో సుస్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకున్నాను. ఇవన్నీ నా బాధ్యతను మరింతగా పెంచుతున్నాయి’ అంటున్నారు అర్చన.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -