– మణిపూర్ నీటి కాలుష్య చట్ట సవరణకు రాజ్యసభ ఆమోదం
– మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించాలి
– ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు
– రాజ్ భవన్ పేరును మార్పుపై రాజ్యసభలో రగడ
– సభా నాయకుడు సభను బుల్డోజర్ చేస్తున్నారు : ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో పొగాకుపై ఎక్సైజ్ సుంకం రేటు పెంపు బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో మణిపూర్ నీటి కాలుష్య చట్ట సవరణకు ఆమోదం లభించింది. బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు ఎటువంటి అంతరాయం కలగకుండా సజావుగా సాగాయి. లోక్‌సభలో పొగాకుపై పన్ను విధించే కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు ఒకసారి అమలులోకి వస్తే, ప్రస్తుతం అన్ని పొగాకు ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ తరువాత పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రేటును పెంచడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.
మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించాలి
రాజ్యసభలో మణిపూర్‌లో నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) సవరణ చట్టం-2024 చట్టబద్ధమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) సవరణ చట్టాన్ని రాష్ట్రానికి విస్తరించాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నందున కేంద్ర చట్టంపై ఉభయ సభలు తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు. తీర్మానంపై చర్చలో పాల్గొన్న సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్, టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపుపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ”మణిపూర్‌కు సహాయం చేయాలనుకుంటే, వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఇది సహకార సమాఖ్యవాదాన్ని హత్య చేయడమే” అని అన్నారు. డీఎంకే ఎంపీ పి. విల్సన్ మాట్లాడుతూ ”రాష్ట్ర అసెంబ్లీ ఎంతకాలం సస్పెన్షన్‌లో ఉంటుంది. పార్లమెంట్ ఈ తీర్మానాన్ని ఆమోదించడంతో సహా రాష్ట్ర అసెంబ్లీ పాత్రను ఆక్రమించుకుంటుంది” అని విమర్శించారు.
రాజ్ భవన్ పేరును మార్పుపై రాజ్యసభలో రగడ
రాజ్యసభలో రాజ్ భవన్‌లో పేరు మార్చడం, వ్యాఖ్యల తొలగింపుపై మాటల యుద్ధం జరిగింది. దేశంలోని అన్ని రాజ్ భవన్‌ల పేరును లోక్ భవన్‌లుగా మార్చాలని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల అంశాన్ని బుధవారం రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డోలా సేన్ జీరో అవర్‌లో లేవనెత్తారు. దీంతో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ”పార్లమెంట్, అసెంబ్లీ లేదా క్యాబినెట్‌కు దీని గురించి తెలియదని మేము చెప్పాలనుకుంటున్నాం. వారు మీతో (చైర్మెన్) కూడా దీని గురించి చర్చించడం లేదు సార్” అని సేన్ అన్నారు. అయితే, ఉపాధి హామీ నిధులతో సహా ఇతర అంశాలను లేవనెత్తినప్పుడు చర్చ వివాదాస్పదంగా మారింది. దీంతో చైర్ జోక్యం చేసుకుని, ఆ వ్యాఖ్యలు రికార్డులో నమోదు కావని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జె.పి నడ్డా మాట్లాడుతూ ”రాజ్ భవన్ నుంచి లోక్ భవన్‌గా పేరు మార్పు గురించి జీరో అవర్‌లో మాట్లాడటానికి మీరు ఆమెను అనుమతించారు. ఆమె ఉపాధి హామీ, ఇతర సమస్యల గురించి మాట్లాడారు. ఇది ఈ విషయానికి సంబంధించినది కానందున, దానిని తొలగించాలి.రికార్డులోకి తీసుకురాకూడదు. లోక్ భవన్‌కు సంబంధించిన అంశాలను మాత్రమే అంగీకరించాలి” అని అన్నారు. చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఏకీభవిస్తూ ఇతర అంశాలను రికార్డులో నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు.
ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ”ఆమె ఏ విధమైన అసభ్యకరమైన పదాన్ని మాట్లాడలేదు. ప్రతీది ఆ విషయంతో ముడిపడి ఉంది. ఆ విషయం మీ కార్యాలయంలో పరిశీలించారు. ఆ తరువాత ఆమె మాట్లాడారు” అని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చను అడ్డుకుంటోందని అన్నారు. ”సభ నాయకుడు జోక్యం చేసుకోకూడదు. చెప్పినది పార్లమెంటరీ కాదని చెప్పకూడదు. దానిని తొలగించకూడదు. సభా నాయకుడు (సభ) బుల్డోజర్ చేస్తున్నారు. మీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకోవాలనుకోవడం లేదు” అని పేర్కొన్నారు. సభా కార్యకలాపాలు సక్రమంగా జరుగుతున్నాయని చైర్మెన్ పేర్కొన్నారు. జీరో అవర్ సమయంలో జాబితా చేయబడిన అంశాలకు కట్టుబడి ఉండాలని సభ్యులను కోరారు.
గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదవుతోంది. దీంతో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు రావాల్సిన ఉపాధి, కేంద్ర నిధుల పెండింగ్‌పై టీఎంసీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
లోక్‌సభలో పొగాకుపై ఎక్సైజ్ సుంకం రేటు పెంపు బిల్లు ఆమోదం
- Advertisement -
- Advertisement -



