అదితి ఆనంద్… ప్రముఖ చిత్ర నిర్మాత. నీలం స్టూడియోస్, లిటిల్ రెడ్ కార్ ఫిల్మ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. సామాజికాంశాలే ప్రధాన కథా వస్తువులుగా సినిమాలు నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అణగారిన జీవితాల్ని కళ్లకు కడుతూనే, తరాలుగా పాతుకుపోయిన అసమానతలను ఇటీవల తాను నిర్మించి ‘బైసన్’ అనే చిత్రం ద్వారా చూపించారు. ఓ కబడ్డీ క్రీడాకారుడు ఎదుర్కొన్న కుల సమస్య ఆధారంగా ఆమె తీసిన ఈ చిత్రం ఇటీవల ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమె పరిచయం నేటి మానవిలో…
అదితి ‘మై ఖిలాడి తు అనారి’ అనే సినిమాను చూస్తూ పెరిగారు. ఈ చిత్రాన్ని ఆమె సుమారు 600 సార్లు చూశారు. అప్పట్లో దీనికి మించి మరో వినోదం ఆమెకు అందుబాటులో లేదు. వాళ్ల ఇంట్లో కేవలం రెండు వీహెచ్‌ఎస్ క్యాసెట్‌లు మాత్రమే ఉండేవి. మై ఖిలాడి తు అనారితో పాటు మరొకటి ‘బోర్న్ ఫ్రీ’. అప్పట్లో కేబుల్ టీవీ కూడా లేదు. అమితాబ్ బచ్చన్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లకు ఎంతో అభిమానం. అదితి మొదట్లో సైన్యంలో చేరాలని తర్వాత యుద్ధ జర్నలిస్ట్ కావాలని కోరుకున్నారు. కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదు.
ప్రత్యేకంగా చేయాలని
అదితి ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో చరిత్రలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత ఆమె ప్రజలకు మన దేశ చరిత్రకు సంబంధించిన కథలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో డాక్యుమెంటరీలకు పెద్దగా ప్రజాదరణ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె సినిమాలను అధ్యయనం చేయడానికి ముంబైలోని విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌లో చేరారు. ‘ముంబైలో ఉన్నప్పుడు సినిమాలు చూడడం పెద్ద కష్టం కాదు. అయితే ప్రస్తుతం నేను చూస్తున్న సినిమాలు నేను దర్శకత్వం వహించగల సినిమాలు కాదని నాకర్థమయింది. ఇంకేదైనా ప్రత్యేకంగా చేయాలని భావించాను. సినీ నిర్మాణంలో ఆరంభ దశ నుండి పనిచేయాలని భావించాను. అయితే నిర్మాత పాత్ర మాత్రం శక్తివంతమైనది’ అని ఆమె అంటున్నారు.
ఒక సన్నివేశం మార్చివేసింది
మొదట్లో అదితి ‘తేరే బిన్ లాడెన్’, ‘పాన్ సింగ్ తోమర్’ వంటి చిత్రాలకు పనిచేశారు. అవి మంచి ఆదరణ పొందాయి. ధనుష్‌తో కలిసి నటించిన ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అంతర్జాతీయంగా బాగా ఆడింది. తర్వాత ఆమె ‘లిటిల్ రెడ్ కార్ ఫిల్మ్స్’ను స్థాపించారు. ఇది అంతర్జాతీయ నాన్-ఫిక్షన్ ప్రాజెక్టులకు సేవలందిస్తుంది. అదితి, రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రాన్ని చూడటానికి వెళ్లారు. ‘చిత్రం చివరలో రంగులతో కూడిన సన్నివేశం ఉంది. ఆ ఒక్క సన్నివేశంలో దర్శకుడు పా రంజిత్ ముఖ్యమైన రాజకీయ ఉద్యమ చరిత్ర మొత్తాన్ని చెప్పగలిగాడు’ అంటారు ఆమె. ఆ చిత్ర దర్శకుడికి ఆమె సినిమా నచ్చిందని మెసేజ్ పంపారు. అతను వెంటనే సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజు అదితి అతన్ని కలవడం, తమిళంలో పనిచేయడం ప్రారంభించారు.
‘కాలా’ రావడానికి ముందే
అదితి ‘కాలా’ చూడటానికి ముందు ఢిల్లీలో ఓ సంఘటన జరిగింది. ఒక బార్ ‘భాంగి జంపింగ్’ (భాంగి అనేది కులతత్వానికి సంబంధించిన పదం) అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘అది ఢిల్లీలో సాధారణంగా ఉపయోగించే పదం. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ దానికి ప్రతిస్పందనను నేను చూశాను. పట్టణంలో పెరిగితే కుల సమస్య ఎదుర్కోరని చాలా మంది భావిస్తారు. కానీ మనం కులానికి సంబంధించిన సర్వవ్యాప్త స్వభావాన్ని గమనించడం ప్రారంభించిన తర్వాత అది ప్రతిచోటా ఉంటుంది’ అని ఆమె అంటున్నారు. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆమె పా రంజిత్‌తో కలిసి పనిచేయాలని కోరుకున్నారు. అతను కూడా సామాజిక సమస్యలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. రంజిత్ ద్వారా ఆమె దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత, గేయ రచయిత మారి సెల్వరాజ్‌ను కలిశారు. ఆమె పా రంజిత్‌తో కలిసి నీలం స్టూడియోస్‌ను స్థాపించారు. ఇది వారి ఉమ్మడి ప్రాజెక్టులకు సృజనాత్మక నిలయం.
ప్రేక్షకులు పసిగడతారు
అదితి నిర్మాతగా సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బైసన్’. ‘నా దృష్టిలో సినిమా అనేది చిత్రనిర్మాత, దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది. విజయం మాత్రం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రేక్షకులు సినిమాలోని లోపాలను వెంటనే పసిగట్టగలరు. ప్రేక్షకులు తమను తాము తెరపై చూసుకునే కంటెంట్‌ను కోరుకుంటారు. అలాంటి సమస్యనే ప్రేక్షలు బైసన్‌లో చూశారని నా అభిప్రాయం. బైసన్ విజయం తర్వాత సినిమా ఒక భావోద్వేగ మాధ్యమం, ఓ నిర్మాతగా సమతుల్యత అనేది కేవలం సృజనాత్మకత వర్సెస్ కమర్షియల్ కాదు. ఇది రిస్క్‌ను సమతుల్యం చేయడం’ అని ఆమె ఎత్తి చూపారు.
సినిమాతో అనుభవం
అదితి తమిళ సినిమాతో తన అనుభవాన్ని రెండు విధాలుగా వివరిస్తారు. ‘ఒకటి సినిమా విద్యార్థినిగా, నిర్మాతగా, పౌరురాలిగా నా అనుభవం అద్భుతమైనది. మరొకటి స్త్రీగా, స్త్రీ నిర్మాతగా అనుభవం భయంకరమైనది’ అంటారు. ఆమె తన సహాయకుడితో కలిసి ఒక సమావేశానికి వెళితే పెట్టుబడిదారుడు ఆమెతో కాకుండా అతనితోనే మాట్లాడాడు. ‘పురుషులంటే మనకు చాలా గౌరవం. ఆరాధిస్తాం కూడా. కానీ వాళ్లు మాత్రం మనల్ని అస్సలు గౌరవించరు. తమిళ చిత్ర పరిశ్రమలో కొన్ని స్వరాలు, కథలు ఈ సమస్యకు దూరంగా ఉండటం నాకు నచ్చడం లేదు. సుధా కొంగర తప్ప ఎంత మంది మహిళా చిత్రనిర్మాతలు ఉన్నారు? ఎంత మంది మహిళా రచయితలు ఉన్నారు?’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
హక్కుల కార్యకర్తగా…
బైసన్ సెట్‌ను ఇద్దరు మహిళలతో పాటు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నడిపారని ఆమె గర్వంగా చెబుతున్నారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యను చూపగలిగానని ఆమె అంటున్నారు. ‘నేను బైసన్ సెట్‌లో 20 రోజులు గడిపాను. అక్కడే దర్శకత్వం వహించాలనే ప్రేరణ పొందాను. కానీ నేను నాలోని స్వరాన్ని కనుగొనాలనుకుంటున్నాను. నేను ఇంకా దాన్ని కనుగొనలేదు. వెంటనే దాన్ని కనుగొనాలి’ అని ఆమె అంటున్నారు. సినీ నిర్మాతగానే కాకుండా అదితి LGBTQ+ హక్కుల కార్యకర్త కూడా. సుప్రీంకోర్టులో ఉన్న ‘పెండ్లిలో సమానత్వం’ కేసులో ఆమె, ఆమె భాగస్వామి సుసాన్ పిటిషనర్లలో ఉన్నారు. ‘మా స్వలింగ వివాహం, రాజ్యాంగ హక్కు డిమాండ్‌ను కోర్టు తిరస్కరించినప్పటికీ కొన్నిసార్లు ఇది విజయం గురించి కాదు, మా పోరాట పటిమను ప్రపంచానికి తెలియజేస్తుంది. మనం ఓడిపోయినా, మరింత శక్తివంతంగా పోరాడాలని నేను భావిస్తున్నాను. దేశంలో చాలా బిగ్గరగా స్వరాలు వినిపిస్తున్నప్పటికీ చాలా మంది భారతీయులు వివాహాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దానికంటే సమానత్వ వివాహాలకు ఎక్కువ సానుకూలత ఉందని నేను నమ్ముతున్నాను’ అని ఆమె నొక్కి చెబుతున్నారు.
ఆశావాహ కథలే చెప్తాను
బైసన్ గురించి మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో నాలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది అవసరం. మన కథలు చెప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. నా కోసం మరెవరో దీన్ని చేస్తారని నేను అనుకోను. నేను ఆశావాహ కథను చెప్పాలనుకుంటే, ఇది నేనే చెప్పాల్సిన కథ. ఎందుకంటే ఇది నా హృదయం నుండి నేను చెప్పగలను. నేను ఎప్పుడూ సినిమాలు తీయడానికి సినీ రంగంలోకి రాలేదు. సినిమా శక్తివంతమైనది, కొంత వరకు ప్రపంచాన్ని మార్చగలదు. కనుక నా ప్రయత్నం నేను చేయాలని వచ్చాను’ అంటారు అదితి.
- డా|| సలీమా



