– కులమతాలుగా విభజించి విద్వేషపాలన
– అందుకే బీసీ రిజర్వేషన్ బిల్లు అడ్డగింత
– రాజ్యాంగాన్ని సైతం మార్చే కుట్ర
– పోరాటాలకు సిద్ధపడితేనే వారి ఆగడాలకు అడ్డుకట్ట : ఏచూరి జయంతి సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కేంద్రంలోని మోడీ సర్కార్‌కు, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రజలు సమానత్వంగా ఉండటం నచ్చదు. అందుకే కులాలుగా, మతాలుగా విభజించి విద్వేషాలు పెంచి పోషిస్తున్నాయి. కులాల్లోనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ అసమానతలు సృష్టిస్తున్నాయి. ప్రజలను విడగొట్టి దోపిడీ వర్గాలకు అనుకూల వైఖరి అవలంబిస్తు న్నాయి. రాజ్యాంగాన్ని సైతం మార్చే కుట్ర పన్నుతు న్నాయి.. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు సంఘటితంగా పోరాటాలకు సిద్ధపడితేనే బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ‘దోపిడీ రహిత సమాజం కోసం ఏచూరి పరితపించారు. పేద, ధనిక అనే వ్యత్యాసం చూపొద్దని రాజ్యాంగం చెబుతోంది.. అది సహించని ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ తన సిద్ధాంతంలో భాగంగా చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేసేందుకు యత్నిస్తోంది.
రాజ్యాంగాన్ని వివిధ రూపాల్లో నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ప్రజలను సామాజికంగా, ఆర్థిక వెనుకుబాటుకు గురిచేస్తోంది.. దేశంలో ఒక్క శాతం ప్రజల వద్ద 40 శాతం సంపద పోగుపడగా.. 50 శాతం మంది ప్రజలు మూడు రూపాయలు పంచుకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఈ అసమానతలు ఎందుకు ఉండాలి? దోపిడీ వ్యవస్థను పెంచి పోషించడంతో శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడే పుట్టి ఇక్కడే జీవించే వారికి సమాన హక్కులు ఎందుకు లేవు..?’ అని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రజలు తిరగబడాల న్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన 11 ఏండ్లలో దేశ వ్యాప్తంగా లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత వాసులకు 200 రోజులు పని కల్పించాలంటే 50-60 రోజులు కూడా కల్పించిన దాఖలాలు లేవన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాల్లేని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తెచ్చిందన్నారు.
ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్యం
ఒక చోట దొంగ ఓటర్లను జొప్పిస్తూ.. మరోచోట ఉన్న ఓట్లను తొలగిస్తూ మోడీ ప్రభుత్వం ఎన్నికల తీరుతెన్నులను మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని జాన్‌వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికవుతేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదన్నారు. బీహార్‌లో తమకు వ్యతిరేకంగా ఉన్న దళితుల, మైనార్టీల, ముస్లిం, ఇతర ప్రజల ఓట్లు మొత్తం 65 లక్షలు తొలగించారని.. ఇతర చోట్ల దొంగ ఓటర్లను చేర్చుతూ ఎన్నికలకు అర్థం లేకుండా చేస్తోందని, ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరి స్తోందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు శ్రామికవర్గాలను కులమతాలకతీతంగా సంఘటితం చేసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా, మత సామరస్యం కోసం ఐక్య ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో రాష్ట్ర కమిటీ సభ్యులు వెంక ట్రాములు, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు మోతీరాం నాయక్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొత్త నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు రేణుక, సురేశ్‌గొండ, రవీందర్, ఖలీల్, అజరు, అరుణ్, రాజనర్సు పాల్గొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు సమానత్వం పట్టదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES