ఈసీతో కలిసి కుతంత్రాలు
వారి కుట్రను ఇండియా బ్లాక్ అనుమతించదు
ప్రమాదంలో రాజ్యాంగం..
ప్రజలు ఐక్యంగా ఉండాలి : బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ప్రారంభించిన రాహుల్ గాంధీ
పాల్గొన్న ఖర్గే, లాలూ, తేజస్వీ
పలువురు ఇండియా బ్లాక్ నేతలు
పాట్నా : పేదలకు ఉన్న ఏకైక శక్తి వారి ఓటు అనీ, అది కూడా చోరీకి గురవుతున్నదని బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్‌లోని సాసారం నగరంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ఆయన ప్రారంభించారు. బీహార్‌లో ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా రాహుల్ ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. 16 రోజుల పాటు జరిగే ఈ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ర్యాలీతో ముగుస్తుంది. ఈ యాత్ర బీహార్‌లోని మొత్తం 25 జిల్లాలను కవర్ చేస్తూ 1300 కిలో మీటర్లు సాగనున్నది. ఈ యాత్రలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్, సీపీఐ(ఎం-ఎల్) లిబరేషన్ నాయకులు దీపాంకర్ భట్టాచార్య వంటి ఇండియా బ్లాక్ నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే ‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను నిర్వహించిన విషయం విదితమే. ఈ ప్రారంభోత్సవ సభలో రాహుల్ ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయాలను సాధించటానికి అవకతవకలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ” లక్షలాది మంది ఓటు హక్కును తొలగించటానికి బీజేపీ ఓటర్లను అణచివేస్తున్నది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలను మార్చటం వంటి సందేహాస్పదమైన పద్ధతులను ఉపయోగిస్తున్నది. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. పేదలకు ఉన్న ఏకైక శక్తి వారి ఓటు. అది కూడా చోరీకి గురవుతున్నది” అని రాహుల్ అన్నారు. ఇలాంటి వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో ఓట్లను దొంగిలిస్తోందనీ, ఇప్పుడిది ప్రపంచం మొత్తానికీ తెలుసు అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను దొంగిలించటానికి, వారి కుట్రలో విజయం సాధించటానికి ఇండియా బ్లాక్ అనుమతించబోదని చెప్పారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ తన నుంచి అఫిడవిట్ కోరిందనీ, బీజేపీ నేతలు కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఈ ప్రస్తావనను తీసుకురాలేదని రాహుల్ అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్‌లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, ఇది రాజ్యాంగాన్ని కాపాడటానికి జరుగుతున్న పోరాటమని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను దొంగిలిస్తున్నారనీ, బీహార్‌లో ఓట్లను దొంగిలిం చడానికి ఎస్‌ఐఆర్ ద్వారా ఓటర్లను తొలగించి, చేర్చడమే వారి కుట్ర అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఇండియా బ్లాక్ సత్తా చాటిందనీ, మహారాష్ట్రలో ఎగ్జిట్‌పోల్స్ సర్వేలోనూ ఇండియా బ్లాక్ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ నాలుగు నెలల్లో కోటి మందికి పైగా ఓటర్లు చేరటంతో బీజేపీ గెలిచిందని చెప్పారు. ఓటర్లను చేర్చిన నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కర్నాటకలోని ఒకే నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు తారుమార య్యాయని దర్యాప్తులో తేలిందనీ, ఓటర్లను మోసం చేశారని రాహుల్ ఆరోపించారు. ఈ యాత్రను ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంగా, రాజ్యాంగ విలువలను కాపాడే ఉద్యమంగా అభివర్ణించారు. ప్రజలు తమ ఓటు హక్కులను కాపాడుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు.
రెండో స్వాతంత్య్ర పోరాటానికి సమానం : లాలూ
ఎన్డీఏ బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్ల ఓటు హక్కును కోల్పోయేలా చేసిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల అణచివేతను జరుపుతున్నదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఈ సమావేశంలో అక్కడి జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ”మేము ప్రజాస్వామ్యం కోసం త్యాగాలు చేశాం. ఈ యాత్ర రెండో స్వాతంత్య్ర పోరాటానికి సమానమైన ఉద్యమానికి నాంది పలుకుతుంది” అని లాలూ అన్నారు.
ఈసీ విఫలం : ఖర్గే
ఈసీ అన్ని రికార్డులనూ అందుబాటులో ఉంచినప్పటికీ.. ఓటర్ల డేటాలో వ్యత్యాసాలను పరిష్కరించటంలో విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని అన్నారు. సాధారణ పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడటానికి ఈ యాత్ర ‘చారిత్రక పోరాటం’ అని ఆయన అభివర్ణించారు. ఈ యాత్ర పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం జరిగే పోరాటమని తేజస్వీ యాదవ్ అన్నారు. బీజేపీ నిరంకుశ వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయటం ఈయాత్ర లక్ష్యమని చెప్పారు.
బీజేపీ ఓట్ చోర్
- Advertisement -
- Advertisement -