నవతెలంగాణ-హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కార్‌గా చెప్పుకుంటున్న బీజేపీ..బిలినియర్ల కోసమే పని చేస్తుందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, అధికారం దుర్వినియోగమవుతుందని మండిపడ్డారు. పేద ప్రజలను, కార్మికులను, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
అవినీతిలో కూరుకుపోయిన మోడీ సర్కార్ ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని, అవినీతి, అధికార దుర్వినియోగం, అహంకార బీజేపీ రాజకీయాల్లో పై నుంచి కింద వరకు వ్యాపించిందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఉత్తరాఖండ్‌లో అంకిత భండారి దారుణ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది, కానీ నేటికీ ప్రశ్న అలాగే ఉంది, అధికారంలో ఉన్న బీజేపీ ఏ వీఐపీని రక్షిస్తుందని? చట్టం అందరికీ సమానంగా ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు.
నేరస్థులను బీజేపీ కాపాడుతోందని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని గాంధీ ఆరోపించారు. అందుకు నిదర్శనం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ కేసును ఉదాహరణగా చెప్పారు. న్యాయం కోసం బాధితురాలు పోరాడవలసి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లైంగిక దాడి కేసులో.. నేరస్థులు అధికార దురహంకారంతో ఎలా రక్షించబడ్డారో, బాధితుడు న్యాయం కోసం ఎంత చెల్లించాల్సి వచ్చిందో దేశం మొత్తం చూసిందని తెలియజేశారు.ఇండోర్‌లో విషపూరిత నీరు తాగడంతో అనేక మంది మరణించినా, కల్తీ దగ్గు మందులతో చిన్నారులు కన్పుమూసిన మోడీ ప్రభుత్వానికి చలనం లేదని వాపోయారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సామాన్య భారతీయులకు అన్ని సమస్యలేనని, మోడీ హాయంలో జరిగేది అభివృద్ధి కాదని, వినాశనమని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.



