హైకోర్టు స్టేపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
బీసీ రిజర్వేషన్లకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
అఖిలపక్షం, బీసీ సంఘాల సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-బంజారాహిల్స్
కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. హైకోర్టు స్టేపై ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కళింగ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. 50 శాతం అనేది రాజ్యాంగంలో లేదని, ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం దాటవచ్చని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు. లీగల్ పోరాటాలు కొనసాగించాలని, కార్యాచరణ సిద్ధం చేయాలని, అందుకు అందరినీ ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలని, అదే స్ఫూర్తితో అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు.
ఢిల్లీలో కార్యాచరణ ఖరారు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలన్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఎంపీ లక్ష్మణ్ చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ.. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని, అసెంబ్లీ నుంచి పంపిన బిల్లును ఆమోదించేలా గవర్నర్ మీద ఒత్తిడి తేవడం అన్నారు. అందరినీ కలుపుకొని తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం ఉధృతం చేయాలని, ఆలస్యం చేయొద్దని అన్నారు. అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణన చేసిందని, అసెంబ్లీలో ఆమోదింపజేసిందని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అడ్డుకు మొదటి ముద్దాయి బీజేపీ అని, రాజ్ భవన్‌లను రాజకీయ కేంద్రాలుగా చేసుకుని రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీసీలంతా వేలాదిగా రాజ్‌భవన్‌ను ముట్టడించాలని పిలుపు నిచ్చారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఈ విషయం లో సీఎంతో అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు కలిసి నడుస్తాయని తెలిపారు. బీసీ సమాజం రోడ్ల మీదకు వస్తే పరిస్థితి వేరే ఉంటుందని హెచ్చరించారు. కులాల వారీగా వీడిపోతే రాష్ట్రంలో చాలా సమస్యలు వస్తాయని, వెంటనే అల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలని సీఎంను కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), ఆనంద్ కుమార్ గౌడ్ (బీజేపీ), గోవర్ధన్ సీపీఐ(ఎంఎల్), 30 బీసీ కుల సంఘాలు, 80 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, యూనివర్సిటీ ఆచార్యులు, బీసీ సంఘాల నేతలు విజీఆర్ నారగొని, దాసు సురేష్, ఇందిర శోభన్, కుందారం గణేష్‌చారి, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వరి, ప్రొఫెసర్ నరేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యాం కుర్మా, ఉప్పర శేఖర్ సగర, దిటి మల్లయ్య, మురళీకృష్ణ, బర్ల మణిమం జరి సాగర్, గొడుగు మహేష్ యాదవ్ పాల్గొన్నారు.