నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత బరితెగించాడు. భూ వివాదం నేపథ్యంలో ఓ రైతును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గుణా జిల్లా గణేశ్ పుర గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్‌కు, స్థానిక బీజేపీ నేత మహేంద్ర నాగర్‌కు మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మహేంద్ర నాగర్ తన అనుచరులతో కలిసి రామ్ స్వరూప్‌పై దాడికి తెగబడ్డాడు. మొదట రాడ్లతో విచక్షణారహితంగా కొట్టి, అనంతరం థార్ జీపుతో తొక్కించడంతో రామ్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
సాధారణంగా మహేంద్ర నాగర్ చిన్న రైతులను బెదిరించి వారి భూములను ఆక్రమించుకోవడం అలవాటుగా మార్చుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే రామ్ స్వరూప్ కుటుంబం అతని బెదిరింపులకు లొంగకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు.
ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రామ్ స్వరూప్ భార్య, ఇద్దరు పిల్లలపై కూడా దుండగులు దాడి చేశారు. ముఖ్యంగా, రామ్ స్వరూప్ 17 ఏళ్ల కుమార్తెపై మహేంద్ర నగర్ కూర్చుని అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె దుస్తులు చించివేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై బాధితురాలైన బాలిక ఓ వీడియోను విడుదల చేసింది. “నేను నాన్నను కాపాడాలని వెళ్లినప్పుడు, ఆయన నా మీద కూర్చుని, కొట్టి దుస్తులు చింపేశాడు. తుపాకులతో మమ్మల్ని బెదిరించారు” అని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



