నవతెలంగాణ-హైదరాబాద్: ఇల్లుకాలి ఒక్కడుంటే..సుట్టా కాల్చుకోవడానికి నిప్పు ఉందా అన్న చందంగా వరద బాధితుల పట్ల ఓ బీజేపీ మంత్రి ఏటకారంగా ప్రవర్తించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుండపోత వర్షాలకు అతలాకుతలమవుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు భారీగా పోటెత్తాయి. 402 గ్రామాలు నీట మునిగాయి. వాటిలో కాన్పూర్ దెహాత్ జిల్లాలోని గ్రామాలు కూడా ఉన్నాయి. కాగా మంత్రి సంజయ్ నిషాత్ జిల్లాలో పర్యటించి ప్రజలను పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధితులు అంతా మంత్రి వద్దకు చేరుకుని వరదల కారణంగా సర్వస్వం కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కట్టు బట్టులతో సహా అన్నీ కోల్పోయామని అన్నారు. దీంతో మంత్రి సంజయ్..గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగటానికి వస్తుంది. ఆ దర్శనంతో మీరంతా స్వర్గానికి వెళతారు. విపక్షాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రి పరామర్శించిన గ్రామాలు యమునా నది ఒడ్డున ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడు వచ్చాడో కూడా తెలియకుండా గంగా నది అని మాట్లాడటంతో వరద బాధితులు అసహనం వ్యక్తం చేశారు. వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.