Sunday, October 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి

- Advertisement -

లేకుంటే వారి ఇండ్లు ముట్టడిస్తాం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే, కేంద్రం నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు తక్షణం ఆమోదం పొందుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ ఎంపీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, తక్షణం రాజీనామాలు చేయాలనీ, లేనిపక్షంలో వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీల బంద్‌కు మద్దతుగా శనివారంనాడిక్కడి ఖైరతాబాద్‌ చౌరస్తాలో ఆమె భారీ మానవహారం నిర్మించారు. అంతకుముందు ఆటోలతో ప్రదర్శనగా ఖైరతాబాద్‌ చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ దొంగ జీవోలు ఇస్తే, బీజేపీ నేతలు రాష్ట్రంలో అనుకూలంగా ప్రకటనలు చేస్తూ, కేంద్రంలో అడ్డుపడుతున్నారని విమర్శించారు. హంతకులే నివాళులు అర్పించినట్టుగా వీరిద్దరి తీరు ఉందని ఎద్దేవా చేశారు. త్యాగాల ద్వారానే తెలంగాణ ఏర్పడిందనీ, బీజేపీ ఎంపీల కూడా పదవులు త్యాగాలు చేస్తే, బీసీ రిజర్వేషన్లు తక్షణం వచ్చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో యూపీఎఫ్‌ కన్వీనర్‌ బొల్ల శివశంకర్‌, తెలంగాణ జాగృతి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌. రూప్‌ సింగ్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు. కవిత కుమారుడు ఆదిత్య కూడా ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టీజేటీఎఫ్‌ ఆవిర్భావం
తెలంగాణ జాగృతికి అనుబంధంగా తెలంగాణ జాగృతి టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీజేటీఎఫ్‌)ను ఏర్పాటు చేస్తున్నట్టు శనివారం కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం లోగోను ఆమె ఆవిష్కరించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తనకు ఇష్టమైన ఉపాధ్యాయులు అనీ, తెలంగాణ సాధనలో టీచర్లది కీలక పాత్ర అని చెప్పారు. వారి సమస్యలపై పోరాడతామనీ, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీజేటీఎఫ్‌ అధ్యక్షులు మోరం వీరభద్రరావు, అడ్‌హక్‌ కమిటీ సభ్యులు ఘనపురం దేవేందర్‌, జాడి శ్రీనివాస్‌, తానిపర్తి తిరుపతిరావు, ఎం. కవిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -