తెలంగాణ సంస్కతికి నిలువెత్తు రూపం,
తల్లులకు జరిపించే బోనాల ఉత్సవం.
జగదాంబికకు తొలి బోనం -ఎల్లమ్మకు జోడు బోనం,
లక్ష్మమ్మ -పోచమ్మ, మైసమ్మ -మారెమ్మ,
నూకాలమ్మ- అంకాలమ్మ, దుర్గమ్మ- పెద్దమ్మ,
పోలేరమ్మ- ముత్యాలమ్మలకు,
గుగ్గిలం – మైసాక్షి, సాంబ్రాణి- ఊదు పొగలుజూపినం.
జెమిడికమోతలు -డప్పుల దరువులు,
చెన్నకోల దెబ్బలు – బైండ్లోల్ల బొబ్బలు,
సప్తమాతకలకు స్వర్ణ బోనాలు,
చీరా-సారెలతో ఒడిబియ్యాలు.
పాలు-బెల్లం కలిపిన పాశమన్నాలు,
పప్పు-పసుపులతో పులగమన్నాలు,
వేపాకురిల్లలు- గండాలను బాపేటి గండదీపాలు.
తీన్మార్ మోతలు -పోతరాజు ఆటలు,
నిమ్మకాయ దండలు – జడితిచ్చే పోతులు,
గజ్జల లాగులు – పట్టితెచ్చిన పుంజులు.
సిగాలూగుతం, సాక బెట్టుతం,
రంగంమెక్కుతం, ఘటందిప్పుతం.
సిరుల పంట పండేలా… సుఖశాంతులు విరిసేలా…
పొలిమేరనుగాసుకుంట, ఆయురారోగ్యాలు ఇయ్యమని…
ముగ్గురమ్మల మూలపుటమ్మకు
పిల్లా-జల్లతో కలిసి మనసారా మొక్కుతం,
తల్లీ..! మల్లొస్తం అని దీవెనార్తె అడుగుతం.
– తేరాల సాధన గౌడ్