Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసంపన్నులకు వరాలు సామాన్యులకు వాతలు !

సంపన్నులకు వరాలు సామాన్యులకు వాతలు !

- Advertisement -


ట్రంప్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ ఆమోదం

వాషింగ్టన్‌ : ప్రధానంగా పన్నుల్లో కోతలు, సామాజిక వ్యయంలో కుదింపులకు ఉద్దేశించిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ను అమెరికా సెనెట్‌ బుధవారం స్వల్ప మెజారిటీ 51-50ఓట్ల తేడాతో ఆమోదించింది. ప్రధానంగా సంపన్నులైన అమెరికన్లకు లబ్ది చేకూర్చే ఈ బిల్లుపై ఓటింగ్‌ సమయంలో టై కావడంతో ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ తన ఓటుతో ఆ బిల్లును గట్టెక్కించారు. 975 బిలియన్ల డాలర్ల మేరకు వుండే పన్ను రిలీఫ్‌ను కేవలం ఒక్క శాతం మంది కుబేరులు అనుభవించనున్నారు. అదే సమయంలో 0.2శాతం మంది సంపన్నులు 211 బిలియన్ల డాలర్లను అందుకోనున్నారు. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు ఈ బిల్లు మెడికెయిడ్‌, అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్‌ వంటి సామాజిక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కోతలు విధించాలని కోరుతోంది. దీనివల్ల కోటీ 60లక్షల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య బీమా లేకుండా పోతుంది. ఈ పరిస్థితి ప్రతి ఏటా 50వేలకు పైగా నివారించదగ్గ మరణాలకు దారి తీస్తుందని ఒక అధ్యయనంలోకూడా వెల్లడైంది. ఇప్పటికే సామాన్యులు ట్రంప్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన పరస్పర సుంకాల భారాన్ని మోస్తున్నారు. అమెరికన్‌ వర్కర్లను పరిరక్షించడం, సక్రమ వాణిజ్యం అన్న నినాదాలతో ఈ సుంకాల యుద్ధాన్ని ట్రంప్‌ మొదలు పెట్టినా వాస్తవానికి దిగుమతుల ధరలు పెరగడానికి మాత్రమే దారి తీసింది. సంపన్నులకు పన్నుల్లో కోతలు విధించడం, సామాన్యులకు సంక్షేమ కార్యక్రమాలను కుదించడం ద్వారా ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ అమెరికాలో ఆదాయ అసమానతలను మరింత అధ్వాన్నం చేస్తుందని, సామాజిక ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా చేస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు.

ఇటీవల కాలం వరకు అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా వున్న ఎలాన్‌ మస్క్‌ కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాను దివాలా తీయించేందుకే కాంగ్రెస్‌ ఇటువంటి చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -