Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆటలుబ్లాక్‌బస్టర్‌ షో

బ్లాక్‌బస్టర్‌ షో

- Advertisement -

– ఆధునిక క్రికెట్‌లో ఇదో అద్భుత సిరీస్‌
– 5 టెస్టుల్లో ఇరు జట్ల గణాంకాలు అసమానం

టీమ్‌ ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన చిరస్మరణీయం. ఐదు టెస్టులు, 25 రోజులు, 6736 పరుగులు, 1860.4 ఓవర్లు, 21 శతకాలు.. ఇలా ఏ కోణంలో చూసినా ఇరు వైపుల ప్రదర్శన బ్లాక్‌బస్టర్‌. 21వ శతాబ్దంలో ఐదు టెస్టులు ఐదు రోజుల పాటు సాగిన ఏకైక సిరీస్‌ ‘టెండూల్కర్‌-అండర్సన్‌’ ట్రోఫీ మాత్రమే. అసమాన గణాంకాలు నమోదైన అద్భుత సిరీస్‌లో ఇరు జట్ల వ్యత్యాసం అత్యంత స్వల్పం. టెస్టు క్రికెట్‌ స్థాయిని పెంచిన భారత్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌ను గణాంకాల్లో చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
6736 రన్స్‌, 21 సెంచరీలు
ఇంగ్లాండ్‌ పిచ్‌ స్వభావంలో మార్పులు పరుగుల వేటలో సుస్పష్టం. పేసర్ల స్వర్గధామం.. బ్యాటర్ల ప్యారడైజ్‌గా మారటంతో ఐదు టెస్టుల్లో 6736 పరుగులు నమోదయ్యాయి. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో అత్యధికం. 1993 యాషెస్‌లో మరో 20 పరుగులు అదనంగా వచ్చాయి. ఐదు టెస్టుల్లో 19 శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇరు జట్ల బ్యాటర్లు 21 సెంచరీలు కొట్టారు. భారత బ్యాటర్లు 12 శతకాలు సాధించగా.. ఇంగ్లాండ్‌ నుంచి 9 నమోదయ్యాయి. పరుగుల వేటలో ఇరు జట్లు సమవుజ్జీగా కనిపించినా.. విధానం వేరుగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌కు మంచి ఓపెనింగ్‌ ఉండగా.. భారత బౌలర్లు మిడిల్‌ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. భారత్‌కు మంచి ఆరంభం దక్కలేదు. కానీ మిడిల్‌ ఆర్డర్‌లో భారీగా పరుగులు పిండుకుంది. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తొలి పది ఓవర్లలోపే 5 ఐదుసార్లే వికెట్‌ కోల్పోగా.. భారత ఓపెనర్లు 8 సార్లు ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు 54.16 సగటు, 4.34 రన్‌రేట్‌తో 325 పరుగులు చేయగా.. భారత ఓపెనర్లు 33 సగటు, 3.36 రన్‌రేట్‌తో 264 పరుగులు చేశారు. మిడిల్‌ ఆర్డర్‌లో (4-6) భారత బ్యాటింగ్‌ సగటు 65.66 కాగా.. ఇంగ్లాండ్‌ సగటు 51.26 మాత్రమే. జో రూట్‌ 537 పరుగులు చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ 754 పరుగులు బాదాడు. నం.5 స్థానంలో హ్యారీ బ్రూక్‌ 55.66 సగటుతో పరుగులు చేయగా.. అదే స్థానంలో రిషబ్‌ పంత్‌ 68.42 సగటుతో రాణించాడు. ఇరు జట్లకు వ్యత్యాసంగా నిలిచింది రవీంద్ర జడేజా ప్రదర్శన. 6-7 స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన జడేజా 10 ఇన్నింగ్స్‌ల్లో 86 సగటుతో 516 పరుగులు చేశాడు. సిరీస్‌లో జడేజా ఆరు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించాడు. బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్‌ 37.57 సగటు, భారత్‌ 39.77 సగటు సాధించాయి.
బౌలర్లకు పీడకల!
1860.4 ఓవర్లు. ఇందులో ఇంగ్లాండ్‌ వాటా 1052 ఓవర్లు. అత్యధిక ఓవర్లు వేసిన సిరీస్‌గా ఇది నిలిచింది. 14 ఇన్నింగ్స్‌ల్లో 350 ప్లస్‌ స్కోర్లు నమోదు కాగా.. 14 సార్లు ఓ ఇన్నింగ్స్‌లో 80కి పైగా ఓవర్లు వేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో ఇదో రికార్డు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ నాలుగు టెస్టుల్లోనే 140 ఓవర్లు వేయగా.. భారత పేసర్‌ సిరాజ్‌ ఐదు టెస్టుల్లో 185.5 (1113 బాల్స్‌) ఓవర్లు వేశాడు. 23 వికెట్లతో సిరాజ్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ 41.84 సగటుతో 88 వికెట్లు పడగొట్టగా.. భారత్‌ 38.38 సగటుతో 84 వికెట్లు తీసింది. భారత బౌలర్లు 57.7 స్ట్రయిక్‌రేట్‌తో కొట్టగా.. పేసర్లు 50.7 స్ట్రయిక్‌రేట్‌తో 70 వికెట్లు కూల్చారు. ఆసీస్‌లో బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ తర్వాత భారత పేసర్లు (41.8) అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్‌తో మెరిసిన సిరీస్‌ ఇదే.
41 క్యాచులు నేలపాలు
తొలి టెస్టులో పేలవ ఫీల్డింగ్‌తో భారత్‌ విజయానికి దూరం కాగా.. ఇదే ఒరవడి తర్వాతి టెస్టుల్లోనూ కొనసాగింది. ఐదు టెస్టుల్లో ఇరు జట్లు 41 క్యాచులు నేలపాలు చేశాయి. ఓ టెస్టు సిరీస్‌లో 41 క్యాచులు చేజారటం ఇదే ప్రథమం. భారత్‌ 23 క్యాచులు వదిలేయగా.. ఇంగ్లాండ్‌ 18 క్యాచులు వదిలేసింది. ఇక డిఆర్‌ఎస్‌ సమీక్షలోనూ ఈ సిరీస్‌ ఓ ట్రెండ్‌ సృష్టించింది. ఐదు టెస్టుల్లో భారత్‌, ఇంగ్లాండ్‌ 63 సార్లు అంపైర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేశాయి. అందులో 44 సమీక్షలు విజయవంతం కాలేదు. 69.8 శాతం రివ్యూలు తేలిపోగా.. అంపైర్లు కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌ 24 రివ్యూలు అన్‌సక్సెస్‌ఫుల్‌ కాగా.. ఇంగ్లాండ్‌ రివ్యూలు 20 వృథా అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -