అశ్వారావుపేట, మణుగూరు ల్లో నేటి నుండి అందుబాటులో రక్తావసర సేవలు…
ఆయా ఆస్పత్రులకు అందిన అనుమతి పత్రాలు..
రక్తం కోసం ఎదురుచూసే పరిస్థితికి స్వస్తి…
ఆయా ఎమ్మెల్యేల సూచన మేరకు ప్రత్యేక కృషి చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు లు..
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమన్వయం తో అనుమతులను సాధించిన వైద్య సిబ్బంది…
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లాలో కేవలం కొత్తగూడెం భద్రాచలం లో మాత్రమే రక్త నిధి కేంద్రాలు ఉండగా ఇప్పుడు నూతనంగా అశ్వారావుపేట ,మణుగూరు ఏరియా ఆసుపత్రులలో సైతం రక్త నిల్వ కేంద్రాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక అనుమతులు ఆయా ఆసుపత్రులకు లభించింది. అతి త్వరలో ఇల్లందు లో సైతం రక్త నిల్వ కేంద్రం సేవలు రానున్నవి.
ప్రస్తుతం గర్భిణి, సికిల్ సెల్ ఎనీమియా,తలసేమియా,ఇతర రక్త హీనత తో ప్రతి నెల రక్తం ఎక్కించుకునే వారికి,రోడ్డు ప్రమాదాలు వంటి సందర్భం లో రక్తం కోసం మణుగూరు, అశ్వారావుపేట ఇల్లందు నుండి సమీపంలో కొత్తగూడెం ,భద్రాచలం, సత్తుపల్లి లేదా పాల్వంచ వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు అశ్వారావుపేట, మణుగూరు ఏరియా ఆసుపత్రుల లోనే రక్తం అందుబాటులో ఉంటుంది. తద్వారా ఎమర్జెన్సీ సమయంలో తక్షణ చికిత్స అందుతుంది.ప్రాణాపాయ స్థితి గా పరిగణించబడే (గోల్డెన్ హవర్) లో చికిత్స ఇచ్చి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
2023 లో మంజూరైన ఇల్లందు,మణుగూరు,అశ్వారావుపేట ఆసుపత్రుల రక్త నిల్వ కేంద్రాలు కొన్ని సాంకేతిక సమస్యలు తో ప్రారంభానికి నోచుకోలేదు.ఈ సమస్యని స్థానిక ప్రజాప్రతినిధులు ఐన జారె ఆదినారాయణ,పాయం వెంకటేశ్వరరావు ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవ చూపి డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఆదేశాలు ఇవ్వగా మంగళవారం అనుమతి పత్రాలు మంజూరు అయ్యాయి. అశ్వారావుపేట నిల్వ కేంద్రానికి డాక్టర్ విజయ్ కుమార్ అప్రూవల్ అధికారిగా,క్వాలిఫైడ్ బ్లడ్ స్టోరేజ్ ల్యాబ్ టెక్నీషియన్ గా లాబ్ టెక్నీషియన్ మహ్మద్ జిలానీ లు పర్యవేక్షకులు గా వ్యవహరించనున్నారు.