తిరువనంతపురం : ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకూ సర్‌ను వాయిదా వేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. తిరువనంతపురంలో అసెంబ్లీకి సమీపంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి రతన్ కేల్కర్ కార్యాలయం దిశగా బీఎల్‌ఓలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, వివిధ జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాయాల ఎదురుగానూ నిరసనలను నిర్వహించారు. తిరువనంతపురంలో ఆందోళనల సందర్భంగా బీఎల్‌ఓల సంఘాల నాయకులు మాట్లాడుతూ సర్ వాయిదా వేయాలనే తమ డిమాండ్‌ను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
అలాగే గణన ఫారమ్‌ల పంపిణీకి సంబంధించి అధికారులు తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. 94.5 శాతం ఫారాలు పంపిణీ అయ్యాయని ఈసీ, కలెక్టర్లు చేసున్న వాదనను నాయకులు విమర్శించారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే సర్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని నాయకులు హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పనితో రెండింతల పనిభారంతో బీఎల్‌ఓలు బాధపడుతున్నట్టు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘సర్’కు వ్యతిరేకంగా కేరళలో బీఎల్‌ఓల ఆందోళన
- Advertisement -
- Advertisement -



