– కార్మికుడికి తీవ్ర గాయాలు
– మేడ్చల్ పారిశ్రామిక వాడలోని
ఆల్కలైడ్ కంపెనీలో ఘటన
నవతెలంగాణ- మేడ్చల్
పెను విషాదాన్ని మిగిల్చిన పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మరో ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. మేడ్చల్ పారిశ్రామికవాడలో ఓ ఫార్మా కంపెనీలో సంభవించిన పేలుడులో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్కలైడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం 10గంటల సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఆపరేటర్ గాన్నారం శ్రీనివాస్ రెడ్డి(45) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు, కంపెనీ సిబ్బంది మేడ్చల్‌లోని మెడినోవా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. బాయిలర్ ఆపరేటర్ శ్రీనివాస్‌రెడ్డి 15 ఏండ్లుగా ఆల్కలైడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలిపారు. కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా నియమాలు పాటించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. కంపెనీకి కనీసం ఫైర్ సేఫ్టీ అనుమతులు కూడా లేవని తెలిపారు. కార్మికుల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని వాపోయారు. బాధితుడికి కంపెనీ యజమాన్యం మెరుగైన చికిత్స అందించి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ అద్దాని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ పరిశీలించారు.
ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్
- Advertisement -
- Advertisement -