– రైల్వేస్టేషన్ చెత్తకుప్పలో ఉన్న బాంబును కొరికిన కుక్క, పేలడంతో మృతి
– పరిశీలించిన బాంబు స్క్వాడ్.. నాటుబాంబుగా నిర్ధారణ
– సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చెయొద్దు : ఎస్పీ రోహిత్ రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. చెత్తకుప్పలో తినే పదార్ధంగా భావించి ఓ వీధి కుక్క బాంబును కొరకడంతో అది పేలింది. దాంతో అక్కడికక్కడే కుక్క మృతిచెందిన ఘటన కొత్తగూడెంలో సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, త్రీటౌన్ పోలీసులు, డాగ్, బాంబ్‌స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ బాంబులు అక్కడకి ఎలా వచ్చాయో విచారణ చేపట్టారు. కాగా, రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేశారు. మూడు సంచుల్లో ఐదు బాంబులు ఉండగా, ఒక బాంబును కుక్క కొరికింది. మరో నాలుగు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు కొత్తగూడెం త్రీ టౌన్ సీఐ శివ ప్రసాద్, వన్ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు : ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉల్లిగడ్డ ఆకారంలోని నాటుబాంబును కొరికి ఒక కుక్క మృతి చెందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుంచి వీధి కుక్క తినే పదార్థంలా భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటుబాంబును రైల్వే ట్రాక్ మీదకు తీసుకువచ్చింది. దాన్ని కొరకడంతో అది పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందని వివరించారు. నాటు బాంబులను చెత్తలో పడేసిన వ్యక్తుల గురించి పోలీసులు విచారణ జరుపుతు న్నారన్నారు. ఈ ఘటనలో మరేవిధమైన కోణం లేదని నిర్ధారించారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
కొత్తగూడెంలో బాంబు కలకలం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



