నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ఆదివారం ఉదయం చెన్నైలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చెన్నై నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. నివాసం లోపల, బయట అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాల్లోని భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
బాంబు డిటెక్షన్, డిస్పోజల్ బృందాలు సుమారు గంటన్నర పాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. సుదీర్ఘ తనిఖీల అనంతరం, ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఇది కేవలం నకిలీ బెదిరింపు కాల్ అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తప్పుడు బెదిరింపు కాల్ వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.