Monday, July 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅటు రాజకీయాలు... ఇటు వ్యాపార ప్రయోజనాలు

అటు రాజకీయాలు… ఇటు వ్యాపార ప్రయోజనాలు

- Advertisement -

– ట్రంప్‌ స్కాట్లాండ్‌ పర్యటన వెనుక మర్మం ఇదే
– గోల్ఫ్‌ కోర్సు ఏర్పాటులో బిజీబిజీ
ఎడెన్‌బర్గ్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు అత్యంత ఇష్టమైన స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్నారు. స్కాట్లాండ్‌ ఈశాన్య తీరంలోని ఇసుక దిబ్బలు ఆయనకు ఈ భూమి పైన అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలలో ఒకటి. ‘ఏదో ఒక సమయంలో…బహుశా నా వృద్ధాప్యంలో అక్కడికి వెళతాను’ అని ట్రంప్‌ 2023లో ఓ కేసు విచారణ సందర్భంగా చెప్పారు. అబెర్డీన్‌షైర్‌లోని బాల్మెడీలో ఉన్న తన ఆస్తుల అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్‌ ప్రణాళికను ఆయన ఆ సందర్భంలో ప్రస్తావించారు. 79 సంవత్సరాల వయసులో రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టిన ట్రంప్‌ ఇప్పుడు తన ప్రణాళికకు కార్యరూపం ఇచ్చే పనిని మొదలు పెడుతున్నారు. తన పేరిట స్కాట్లాండ్‌లో నిర్మించిన నూతన గోల్ఫ్‌ కోర్సును ఆగస్ట్‌ 13న ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రంప్‌ స్కాట్లాండ్‌ పర్యటనకు ఇది కూడా ఓ కారణమే.
ట్రంప్‌ మంగళవారం వరకూ స్కాట్లాండ్‌లోనే ఉంటారు. పనిలో పనిగా బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వన్‌ డెర్‌ లేయన్‌తో వాణిజ్య చర్చలు జరపాలని ఆయన అనుకుంటున్నారు. అబెర్డీన్‌ ప్రాంతంలో ట్రంప్‌కు ఇప్పటికే ఇంటర్నేషనల్‌ స్కాట్లాండ్‌ అనే మరో గోల్ఫ్‌ కోర్సు కూడా ఉంది. స్కాట్లాండ్‌ నైరుతి తీరంలో 320 కిలోమీటర్ల దూరంలో టర్న్‌ బెర్రీ సమీపంలో ఉన్న ట్రంప్‌ కోర్సును కూడా ఆయన సందర్శించబోతున్నారు. కొత్త కోర్సు కోసం తన కుమారుడు ‘రిబ్బరు కత్తిరించాడు’ అని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ 2023లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయడానికి తండ్రితో కలిసి వచ్చారు.

గోల్ఫ్‌ అంటే మక్కువే
ట్రంప్‌కు గోల్ఫ్‌ అంటే ఎంతో మక్కువ. 2018లో తన తొలి పదవీకాలంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫిన్లాండ్‌లో సమావేశానికి వెళుతూ మధ్యలో స్కాట్లాండ్‌లో దిగారు. అక్కడ టర్న్‌ బెర్రీ కోర్సు ఆడారు. ట్రంప్‌ పాలన ఆయన వ్యాపారంతో పెనవేసుకుపోయిందని వాషింగ్టన్‌లోని సిటిజన్స్‌ ఫర్‌ రెస్పాన్సబులిటీ అండ్‌ ఎథిక్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జోర్డాన్‌ లిబోవిట్జ్‌ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌ అనేది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌లో ఓ విభాగమని ఆయన చెప్పారు. ప్రస్తుతం ట్రంప్‌ ఆస్తులు ఆయన పిల్లలు నిర్వహిస్తున్న ట్రస్టులలో ఉన్నాయి. ఆయన అధ్యక్ష భవనంలో ఉన్నప్పుడు ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ రోజువారీ కార్యకలాపాలను వారే నిర్వహిస్తుంటారు. ఈ కంపెనీ గోల్ఫ్‌ కోర్సులకు సంబంధించి అనేక లాభదాయకమైన విదేశీ ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఖతార్‌, వియత్నాంలో విలాసవంతమైన కోర్సుల నిర్మాణం కూడా వీటిలో ఉంది.

కోర్టు కేసులలో చిక్కుకొని…
ప్రస్తుతం అబెర్టీన్‌షైర్‌లోని గోల్ఫ్‌ కోర్సు కోర్టు కేసులలో ఉంది. దీనిని లాభాల బాటలో నడపడం చాలా కష్టమైంది. సమీపంలోని ఇసుక దిబ్బలను పాక్షికంగా ధ్వంసం చేశారని స్కాట్లాండ్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ అధికారులు గుర్తించారు. సమీపంలో పవన విద్యుత్‌ సంస్థ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. స్కాట్లాండ్‌ ప్రభుత్వ ఖర్చులను కూడా ట్రంప్‌ సంస్థే భరించాల్సి వచ్చింది. రుణాలు, ఒప్పందాల కోసం ట్రంప్‌ తన సంపదను పెంచి చూపించాడంటూ ఓ సివిల్‌ కేసు దాఖలైంది. అబెర్జీన్‌ ఏరియా కోర్సు ప్రారంభ ప్రణాళికలో భాగంగా ఓ విలాసవంతమైన హోటల్‌ను, గృహాలను నిర్మించాలని ట్రంప్‌ భావించారు. ఐదు వందల ఇళ్ల నిర్మాణానికి ట్రంప్‌కు అనుమతి లభించగా రెండున్నర వేల గృహాల నిర్మాణానికి అనుమతించాలని ఆయన కోరారు. అయితే ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే వాటి విలువను చూపుతూ రుణం తీసుకున్నాడని సివిల్‌ దావాలో ఆరోపించారు. స్కాట్లాండ్‌లో గోల్ఫ్‌ కోర్సులు ప్రారంభించిన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కాదు. ఆయనకు ముందు అనేక మంది అమెరికా అధ్యక్షులు పదవిలో ఉండగానే స్కాట్లాండ్‌లో గోల్ఫ్‌ కోర్సులు ఏర్పాటు చేశారు.

రాజు వెడలె…
స్కాట్లాండ్‌లో ట్రంప్‌ జరుపుతున్నది అధికారిక పర్యటనే అయినప్పటికీ అక్కడ ఉన్న తన గోల్ఫ్‌ కోర్సులను, వాటి గొప్పతనాన్ని చూపించడానికి ఆయన భారీ పరివారాన్ని వెంటతీసుకొని వచ్చారు. అందులో సలహదారులు, వైట్‌హౌస్‌ సహాయ సిబ్బంది, సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు, విలేకరులు ఉన్నారు. అధికార పర్యటన పేరుతో తన కుటుంబ వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకోవడం ట్రంప్‌ ఉద్దేశంగా కన్పిస్తోంది. అయితే ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేవీ లేవని అధ్యక్ష భవనం చెబుతోంది. ట్రంప్‌ రాజకీయాలలోకి రాకముందే ఆయన వ్యాపారాలు విజయవంతమయ్యాయని గుర్తు చేస్తోంది. ట్రంప్‌ స్కాట్లాండ్‌ పర్యటనను ‘వర్కింగ్‌ ట్రిప్‌’గా అధ్యక్ష భవనం ప్రతినిధి టేలర్‌ రోజర్స్‌ అభివర్ణించారు. ప్రపంచంలో ఆయన అనేక అత్యుత్తమ, అందమైన గోల్ఫ్‌ కోర్సులను నిర్మించారని, వాటిలో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు జరుగుతున్నాయని, వాటిని అంతర్జాతీయ మేటి క్రీడాకారులు ఉపయోగించు కుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -